ఆ ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
రెండు రోజుల ముందే కోడ్ లిఫ్ట్ చేసిన ఈసీ;
శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల) కోడ్ ఎత్తివేసినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నల్గొండ - వరంగల్ - ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కూడా పూర్తయ్యింది. కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకోగా, నల్గొండ టీచర్స్ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఈనెల 8వ తేదీన ముగుస్తుందని.. అప్పటి వరకు ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఈసీ మొదట ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ఎత్తివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.