తిరుపతి ఉప ఎన్నిక.. బాబుకి విషమ పరీక్ష
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చంద్రబాబుకి విషమ పరీక్షలా మారింది. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేసిన బాబు.. ఇప్పుడు అందరికంటే ముందుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాలంటున్నారు. ఈనెల 21నుంచి 10రోజులపాటు తొలి విడతలో.. 700 గ్రామాల్లో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. టీడీపీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేయాలని, వైసీపీ విధ్వంసాలు, పన్నులమోత, అప్పుల భారాలనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే […]
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చంద్రబాబుకి విషమ పరీక్షలా మారింది. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేసిన బాబు.. ఇప్పుడు అందరికంటే ముందుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాలంటున్నారు. ఈనెల 21నుంచి 10రోజులపాటు తొలి విడతలో.. 700 గ్రామాల్లో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. టీడీపీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేయాలని, వైసీపీ విధ్వంసాలు, పన్నులమోత, అప్పుల భారాలనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కీలక నేతలతో బాబు సమావేశమయ్యారు.
ఎందుకంత పట్టుదల..?
వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందనేది చంద్రబాబు వాదన. ఆ వాదన నిజమే అయితే దాని ఫలితం తిరుపతి ఉప ఎన్నికలో బైటపడాలి. దానికంటే ముందే స్థానిక ఎన్నికలొస్తాయనుకుంటే అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో తిరుపతి ఉప ఎన్నికపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో జరుగుతున్న ఆలయాల ఘటనలను ఉప ఎన్నికకు ముడిపెట్టాలని కూడా బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రూపాయి బిళ్లంత బొట్టు నుదుటిన పెట్టి, ఆలయాల సందర్శనకు బాబు కదలి వెళ్లడం కూడా ఈ వ్యూహంలో భాగమే. తీరా ఇప్పుడు ఆలయాల ఘటనల్లో టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అవుతుండే సరికి బాబు ఇరుకున పడ్డారు. ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ పై ఎదురుదాడి ప్రారంభించారు.
2 ఓకే, 3 అయితే పరువు తక్కువే..
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఎవరూ ఊహించలేరు. దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వనంత మాత్రాన సింపతీ ఓట్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. పైగా తిరుపతి పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు, పార్టీ కూడా బలంగా ఉంది. ఈ దశలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని భావించలేం. ఓడిపోతే ఎలాగూ.. అధికార పార్టీ అక్రమాలు చేసిందనే నింద వేయొచ్చు కాబట్టి టీడీపీకి ఓటమికి కారణం వెదుక్కునే అవసరం లేదు. రాగా పోగా మూడో స్థానానికి పడిపోతేనే పార్టీ పరువు పోతుంది. జనసేన-బీజేపీ దూకుడు చూస్తుంటే తిరుపతిలో బాబుని వెనక్కు నెట్టి అసలు సిసలు ప్రతిపక్షం మేమే అని నిరూపించుకునే ఊపులో ఉన్నారు. వారిద్దరి మధ్య సీటు విషయంలో కయ్యం వస్తే మాత్రం సంశయ లాభం చంద్రబాబుదే. క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన కార్యకర్తలు కలసి పనిచేస్తే మాత్రం టీడీపీకి మూడో స్థానమే దిక్కు. అదే జరిగితే.. టీడీపీనుంచి బీజేపీ, జనసేన వైపు వలసలు పెరుగుతాయనే విషయం స్పష్టమవుతుంది. అందుకే బాబు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో తీవ్ర ఆందోళన పడుతున్నారు, ముందస్తు ప్రచారం అంటూ హడావిడి చేస్తున్నారు.