ఇరవైలో ఒక్కటి పనిచేసినా మేలే!
కరోనా వ్యాప్తికి అంతులేనట్టుగానే దాని గురించి వినబడుతున్న కొత్త విషయాలకు సైతం అంతులేకుండా పోతోంది. ఇప్పటికీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు తెలియటం లేదు. దాంతో దీనిగురించి రోజుకో కొత్త వార్త వింటున్నాం. కోవిడ్ 19కి గురయిన పెద్దవారిలో 50 నుండి 66 శాతం మందిలో దాని లక్షణాలు కనిపించడం లేదని… దీనివలన ఇన్ఫెక్షన్ ని గుర్తించడమే అసాధ్యంగా మారుతోందని దక్షిణాఫ్రికా వైద్యులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కి […]
కరోనా వ్యాప్తికి అంతులేనట్టుగానే దాని గురించి వినబడుతున్న కొత్త విషయాలకు సైతం అంతులేకుండా పోతోంది. ఇప్పటికీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు తెలియటం లేదు. దాంతో దీనిగురించి రోజుకో కొత్త వార్త వింటున్నాం.
కోవిడ్ 19కి గురయిన పెద్దవారిలో 50 నుండి 66 శాతం మందిలో దాని లక్షణాలు కనిపించడం లేదని… దీనివలన ఇన్ఫెక్షన్ ని గుర్తించడమే అసాధ్యంగా మారుతోందని దక్షిణాఫ్రికా వైద్యులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కి సారధ్యం వహిస్తున్న డాక్టర్ షాబిర్ మహ్డీ ఈ వివరాలు వెల్లడించారు. పదిశాతం కోవిడ్ కేసులు మాత్రమే అధికారికంగా నమోదు అవుతున్నాయని షాబిర్ అంటున్నారు.
పిల్లల విషయానికి వస్తే… కరోనా సోకిన పిల్లల్లో 80శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. మనం ఊహిస్తున్నదానికంటే ఎక్కువమందిలో లక్షణాలు లేకపోవటం అనేది వ్యాక్సిన్ ట్రయల్స్ కి ఆటంకంగా మారుతోందని డాక్టర్ షాబిర్ తెలిపారు.
వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాలంటే అందుకోసం కరోనా సోకనివారు వాలంటీర్లుగా కావాలి. కరోనా పరీక్షల అనంతరం వారిని ఎంపిక చేస్తారు. అయితే లక్షణాలు లేకపోవటంతో కరోనా లేనివారుగా భావించి వాలంటీర్లుగా ఎంపిక చేసుకుని తీరా…పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో చాలామందిలో కోవిడ్ 19 బయటపడుతోందని షాబిర్ అన్నారు.
వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది ఈ ఏడాది నవంబరు నాటికి తెలిసే అవకాశం ఉందని, కానీ ట్రయల్స్ మాత్రం వచ్చే ఏడాది రెండో భాగం వరకు జరుగుతూనే ఉంటాయని షాబిర్ తెలిపారు. వ్యాక్సిన్ల గురించి మరీ మితిమీరిన ఆశావాదం పనికిరాదని, ప్రపంచవ్యాప్తంగా 200 వ్యాక్సిన్లు తయారీలో ఉన్నా… ట్రయల్స్ నిర్వహించినవాటిలో పదిశాతం మాత్రమే వినియోగించేందుకు వీలుగా లైసెన్స్ పొందుతాయని కూడా ఆయన అంటున్నారు.
వచ్చే 12 నుండి 18 నెలల కాలంలో…. ప్రతి ఇరవై వ్యాక్సిన్లలో ఒక్కటి కరోనానుండి మనల్ని కాపాడుతుందని తేలినా అదే చాలా గొప్ప విషయంగా భావించవచ్చంటున్నారాయన. వ్యాక్సిన్ వచ్చేవరకు చేతులు కడుక్కోవటం, శానిటైజేషన్, సామాజిక దూరం పాటించడం… ఇవే కరోనాకి నమ్మదగిన నివారణ చర్యలని షాబిర్ పేర్కొన్నారు.