విటమిన్ డి... కరోనాను ఢీకొంటుందా?

ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. కరోనాని ఎదుర్కోవటం, దానిని వదిలించుకోవటం. దీనికోసం అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నెన్నో కరోనా పరిష్కారాలు తెరమీదకు వస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు, ఉపాయాలైతే లెక్కలేనన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటన్నింటిలో  విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి మన శరీరంలో తయారవుతుంది. మన చర్మం దీనిని తయారుచేస్తుంది. ఇది కరోనాపై పోరాడుతుందనే నమ్మకం […]

Advertisement
Update:2020-07-06 08:24 IST

ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. కరోనాని ఎదుర్కోవటం, దానిని వదిలించుకోవటం. దీనికోసం అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకోవాలనుకుంటున్నాం.

ఈ నేపథ్యంలో ఎన్నెన్నో కరోనా పరిష్కారాలు తెరమీదకు వస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు, ఉపాయాలైతే లెక్కలేనన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటన్నింటిలో విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి మన శరీరంలో తయారవుతుంది. మన చర్మం దీనిని తయారుచేస్తుంది. ఇది కరోనాపై పోరాడుతుందనే నమ్మకం అందరిలో ఉంది. అయితే ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటి….

గత కొన్నినెలలుగా అనేక దేశాలలో పరిశోధకులు విటమిన్ డి లోపానికి, కరోనా విజృంభణకు మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనాలు చేస్తున్నారు. విటమిన్ డి కొరత ఉన్నవారు రోగనిరోధక శక్తిపరంగా బలహీనంగా ఉన్నారని, వీరిలో రోగనిరోధక వ్యవస్థ అసాధారణ రీతిలో స్పందిస్తోందని, అందుకే కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయని… కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ ది న్యూయార్క్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ ప్రచురించారు.

25 భిన్నమైన అధ్యయనాలను విశ్లేషించి చూసినప్పుడు ప్లేస్ బో (ఔషధమనే భ్రమ కలిగించే డమ్మీ మందులు) తీసుకున్నవారిలో కంటే నిజమైన విటమిన్ డి తీసుకున్నవారిలో శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు వచ్చే రిస్క్ 12 శాతం తగ్గినట్టుగా కూడా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇటీవల చికాగో మెడిసిన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సైతం విటమిన్ డి లోపం ఉన్నవారు కోవిడ్ 19 బారిన పడే అవకాశం 77శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

చాలామంది కోవిడ్ 19 పేషంట్లు ప్రాణాపాయం కలిగించే ఎక్యూట్ రెస్పరేటరీ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య తో బాధపడుతున్నవారిలోనూ, ఇది వచ్చే అవకాశాలున్నవారిలోనూ విటమిన్ డి లోపం ఉన్నట్టుగా 2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిందని యుఎస్ఎ టుడే పేర్కొంది.

కరోనాకు విరుగుడుగా విటమిన్ డి ని తీసుకోమని వైరస్ పైన పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు అది వచ్చిన తొలిరోజుల్లోనే సలహా ఇచ్చారు. నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనల్లో సైతం విటమిన్ డి లోపం అధికంగా ఉన్న దేశాలలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవించినట్టుగా తేలింది. విటమిన్ డి బ్యాక్టీరియా వైరస్ లపై పోరాడటమే కాకుండా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పి మనకే హాని చేయకుండా కూడా కాపాడుతుందని, ఇది ఊపిరితిత్తులకు ఒక రక్షణకవచంలా పనిచేస్తుందని తెలిపే ఆధారాలను బిబిసి వెల్లడించింది.

మనదేశంలో సూర్య రశ్మి ధారాళంగా ఉన్నా… ఇక్కడ కూడా విటమిన్ డి లోపం ఎక్కువగా కనబడుతుంది. దాదాపు 40 నుండి 99శాతం వరకు ఈ లోపం ఉన్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇళ్లలో ఆఫీసుల్లో ఎక్కువగా ఉండే జీవనశైలి ఇందుకు ప్రధానకారణంగా కనబడుతోంది.

ఇటలీ స్పెయిన్ లలో సైతం ఇలాంటి అలవాటే ఉంది. ఆ దేశాలు సైతం కరోనా ప్రభావానికి మరింత ఎక్కువగా గురికావటం మనకు తెలుసు. ఇంగ్లండు, ఇటలీల్లో… రెండవసారి వచ్చే కరోనాని తట్టుకునేందుకు విటమిన్ డిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ తోనూ, కరోనా వ్యాప్తి భయంతోనూ ఇంట్లోనే ఉంటున్నందున్న రోజూ పది మైక్రోగ్రాముల విటమిన్ డి సప్లిమెంటు తీసుకోవాలని ఆ రెండు దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. పదినుండి పదిహేను నిముషాలపాటు సన్ స్ర్కీన్ లేకుండా ఎండలో ఉండాలని స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం సూచించింది.

విటమిన్ డీ నిజంగానే కరోనాని అపుతుందా….

ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటే కోవిడ్ 19 రాదు… అనేందుకు ఏ ఆధారాలు లేవు. అయితే విటమిన్ డి తగినంత స్థాయిలో ఉంటే రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని, దీనిని సప్లిమెంట్లుగా తీసుకుంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లను నివారించే అవకాశం ఉందని మాత్రం వైద్యులు చెబుతున్నారు. పలు వైద్య సంస్ధలు సైతం ఇదే మాట చెబుతున్నాయి.

రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి విటమిన్ డిని సప్లిమెంటుగా తీసుకోవాలని భావించేవారు… తప్పకుండా వైద్య సలహా మేరకే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. తగిన మోతాదుని మించి దీర్ఘకాలం పాటు వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది.

  • యుకె పరిశోధకులు 20 యురోపియన్ దేశాల్లో నిర్వహించిన పరిశోధనల్లో… ప్రజల్లో సగటుకంటే తక్కువగా విటమిన్ డి ఉన్న దేశాల్లో కోవిడ్ 19 కేసులు, మరణాలు ఎక్కువగా ఉండటం గుర్తించారు.
  • నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో డి విటమిన్ లోపానికి, కోవిడ్ 19 తీవ్రతని పెంచేసి రియాక్టివ్ ప్రొటీన్ కి సంబంధం ఉందని తేల్చారు.
  • ఇండోనేషియా పరిశోధకులు 780 కరోనా కేసులను పరిశీలించినప్పుడు మరణించినవారిలో ఎక్కువమందిలో విటమిన్ డి సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండటం గమనించారు.

మొత్తంమీద…. కరోనాకి స్పష్టమైన ఔషధాలు లేని పరిస్థితుల్లో దాని ప్రభావాన్ని తగ్గించే మార్గాలు మనముందు ఏవి ఉన్నా వాటిని నిర్లక్ష్యం చేయలేము. అందుకే విటమిన్ డి లోపం లేకుండా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవటం, వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లు వాడటం మంచిది. పుట్టగొడుగులు, గుడ్లు, సోయా మిల్క్, చేపలు, పెరుగు, ఆవుపాలు, ఆరంజ్ జ్యూస్ మొదలైన ఆహారాలలో విటమిన్ డి లభిస్తుంది.

Tags:    
Advertisement

Similar News