భారత మార్కెట్లో చైనా ఆధిపత్యం

స్మార్ట్ ఫోన్ రంగంలో చైనాదే హవా ఆటోమొబైల్ రంగంలోనూ కీలక వాటా ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం విధించాలని పలు డిమాండ్లు వస్తున్నాయి. కానీ, అది అంత సులభంగా జరిగే పని కాదని నిపుణులు చెబుతున్నారు. భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. గత ఏడాది ఇండియా ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా కంపెనీలు రూ. 1.4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. చైనా […]

Advertisement
Update:2020-06-24 09:43 IST
  • స్మార్ట్ ఫోన్ రంగంలో చైనాదే హవా
  • ఆటోమొబైల్ రంగంలోనూ కీలక వాటా

ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం విధించాలని పలు డిమాండ్లు వస్తున్నాయి. కానీ, అది అంత సులభంగా జరిగే పని కాదని నిపుణులు చెబుతున్నారు. భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. గత ఏడాది ఇండియా ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా కంపెనీలు రూ. 1.4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. చైనా కంపెనీలు భారత మార్కెట్‌ను ఎలా శాసిస్తున్నాయో.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీకి ప్రస్తుతం 71 శాతం వాటా ఉంది. 2018లో 60 శాతం ఉన్న మార్కెట్‌ను రెండేళ్లలో మరో 11 శాతం పెంచుకుంది. మరోవైపు భారతీయ స్మార్ట్ ఫోన్ కంపెనీల వాటా 2018లో 9 శాతం ఉండగా ప్రస్తుతం 1 శాతానికి పరిమితమైంది.

చైనా కంపెనీలు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకుంటుంటే… భారతీయ కంపెనీలైన మైక్రోమాక్స్, లావా, ఇంటెక్స్, కార్బన్.. కొరియన్ కంపెనీలైన శాంసంగ్, ఎల్జీ, జపాన్ కంపెనీ సోనీ తమ వాటాలను రోజు రోజుకూ కోల్పోతున్నాయి.

చైనా కంపెనీలకు ఒక్క శాంసంగ్ కంపెనీ మాత్రమే పోటీ ఇవ్వగలుగుతోంది. అయినా దాని మార్కెట్ షేర్ తక్కువగానే ఉంది. ఇక ఐఫోన్ కు ఇండియాలో ఉన్న మార్కెట్ తక్కువే. లాక్‌డౌన్ సమయంలో చైనాకు చెందిన షావోమీ వస్తువులకు చాలా డిమాండ్ ఉంది. లాక్‌డౌన్ అనంతరం ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఇండో-చైనా ఘర్షణల తర్వాత కూడా చైనా ఫోన్లు నిమిషాల్లో అమ్ముడవుతున్నాయంటే వీటి ప్రభావం మార్కెట్‌పై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆటోమొబైల్ రంగంలోనూ…

చైనా ఉత్పత్తులంటే కేవలం ఎలక్ట్రానిక్స్ వైపే అందరూ చూస్తుంటారు. ఆటోమొబైల్ రంగంలో కియా తప్ప మరే కంపెనీలు మనకు కనపడవు. కానీ 120 బిలియన్ డాలర్ల ఇండియన్ ఆటోమొబైల్ విఫణిలో ఏడాదికి దాదాపు 20 శాతం విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అవుతాయన్నది అక్షర సత్యం. నాణ్యత కలిగి, తక్కువ ధరలకు చైనా ఆటోమొబైల్ విడిభాగాలను తయారు చేస్తోంది. వీటిని దిగుమతి చేసుకోవడానికి భారత ఆటోమొబైల్ పరిశ్రమలు ఎప్పుడూ వెనుకంజ వేయలేదు.

బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. తమ కంపెనీకి ప్రతీ ఏడాది దాదాపు 1 వెయ్యి కోట్ల రూపాయల విలువైన విడిభాగాలను చైనా కంపెనీలు సరఫరా చేస్తున్నాయని అన్నారు. దేశంలో 17 బిలియన్ డాలర్ల ఆటోమొబైల్ దిగుమతులు జరుగుతుంటే.. దానిలో 27 శాతం అనగా.. 4.5 బిలియన్ డాలర్ల దిగుమతులు చైనా నుంచే జరుగుతున్నాయని బజాజ్ స్పష్టం చేశారు.

ఇక ప్రముఖ ద్విచక్రవాహనాల కంపెనీ టీవీఎస్ చైనా కంపెనీతో భాగస్వామ్యం పెట్టుకుంది. దాదాపు 15 ఏళ్లుగా చైనా కంపెనీతో కలసి పని చేస్తున్నామని…. ప్రస్తుత పరిస్థితులు మా భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపవని టీఈ నరసింహన్ అంటున్నారు.

ప్రజల భావోద్వేగాలతో విలువైన భాగస్వామ్యాలను వదులు కోలేమని.. చైనా మార్కెట్‌ను భారత్ శాసించే స్థాయికి వెళ్లాలంటే కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News