సైకిల్ పై 2000 కి.మీ

ఓ పదిహేను మంది యువకులు. అందరూ వలస కార్మికులే. వారి సొంత ఊరు బిహార్ లోని ధర్భంగా జిల్లాలో ఉంది. వారు పని చేసేది ముంబై. కరోనా కారణంగా ముంబైలో పనీ లేదు, సొంతూరు వెళ్లడానికి మార్గమూ లేదు. అయినా వెళ్లాలన్న కోరిక బలంగా ఉంది. అందువల్ల 2000 కి.మీ. మేర సైకిల్ పై వెళ్లాలని వారు బుధవారం తెల్లవారు జామున సైకిళ్లపై ప్రయాణం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లల్లో ప్రయాణించే సౌకర్యం రానందువల్ల వారు […]

Advertisement
Update:2020-05-06 06:50 IST

ఓ పదిహేను మంది యువకులు. అందరూ వలస కార్మికులే. వారి సొంత ఊరు బిహార్ లోని ధర్భంగా జిల్లాలో ఉంది. వారు పని చేసేది ముంబై. కరోనా కారణంగా ముంబైలో పనీ లేదు, సొంతూరు వెళ్లడానికి మార్గమూ లేదు. అయినా వెళ్లాలన్న కోరిక బలంగా ఉంది. అందువల్ల 2000 కి.మీ. మేర సైకిల్ పై వెళ్లాలని వారు బుధవారం తెల్లవారు జామున సైకిళ్లపై ప్రయాణం ప్రారంభించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లల్లో ప్రయాణించే సౌకర్యం రానందువల్ల వారు సైకిళ్లే దిక్కు అనుకున్నారు. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర ఆపకుండా ఉంటే 2000 కి.మి. వెళ్లి వారి స్వగ్రామం చేరుకోవడానికి అనేక రోజులు పడుతుంది.

వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా తమకు ఆ అవకాశం రాలేదని, ఏప్రిల్ 14వ తేదీ తరవాత పంపిస్తామన్న హామీ నెరవేరలేదని, లాక్ డౌన్ విధించి 45 రోజులు గడిచిందని, కూలీ నాలి దొరకనందువల్ల సైకిల్ మీద వెళ్లడం తప్ప తమకు మార్గం లేదని ఆ యువకుల్లో ఒకరు అన్నారు.

వీరు అనేక రాష్ట్రాల సరిహద్దులు దాటాల్సి వస్తుంది. పోలీసుల ఆగ్రహాన్ని చవి చూడాల్సిందే. మండుటెండ సరే సరి. తినడానికి ఏమీ దొరక్క పోవచ్చు. వస్త్రాలు, స్టీలు కంచాలు, అటుకులు తీసుకుని వెళ్తున్నారు ఈ యువకులు. తామందరం కరోనా ఉందేమోనని పరీక్షలు చేయించుకున్నామని ఫలితం ఇంకా తెలియలేదని వాళ్లు చెప్పారు.

నవీ ముంబైలోని ఘన్సోలీ నుంచి మహారాష్ట్రలోని బుల్దానాకు మరో 20 మంది కాలి నడకన బయలుదేరారు. ఈ బృందంలో చిన్న పిల్లలు, ఓ ఏడు నెలల గర్భిణీ కూడా ఉన్నారు.

మార్చి 24న ప్రధానమంత్రి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించేనాటికి అనేక పట్టణాలలో పరాయి రాష్ట్రాలకు చెందిన వారు వివిధ నగరాల్లో రోజు కూలీలుగా పని చేస్తున్నారు. జీవనోపాధి లేకపోవడంవల్ల చాలా మంది ఉండి చేసేదేమీ లేదు కనక సొంతూళ్లకు వెళ్లాలనుకున్నారు. ప్రయాణ సదుపాయాలు ఏమీ లేనందువల్ల కాలి నడకే దిక్కైంది.

వలస కార్మికుల ఇక్కట్లవల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని గ్రహించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపాలని నిర్ణయించింది.

విచిత్రం ఏమిటంటే దిక్కు మొక్కు లేని ఈ వలస కార్మికులు రైలు చార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తోంది. దీని మీద విమర్శలు వెల్లువెత్తడంతో ఈ చార్జీల్లో 85 శాతం మేం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మిగతా టికెట్టు ధర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటోంది.

Tags:    
Advertisement

Similar News