రేవంత్‌కు... రవ్వంత కూడా ఆ... ఆలోచన లేదా?

ఏదో చేస్తాడనుకుంటే..ఏదేదో చేస్తున్నాడట..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన మాటలకు…. చేతలకు అసలు పొంతనే లేదని…అసలు కంటే కొసరు పనుల పైనే ఫోకస్ పెట్టారంటూ రేవంత్‌పై సొంత కేడరే చెవులు కొరుక్కుంటోందట. ఈయనకు తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలపైనే మక్కువ ఎక్కువైందని…. సొంత నియోజకవర్గంలోని తన కేడర్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉంటే… పక్కరాష్ట్ర ముచ్చట్లు మనకెందుకు అంటోందట రేవంత్ అనుచరవర్గం. రేవంత్ రెడ్డి.. తెలంగాణలో మంచి వాగ్దాటి కలిగిన నేత. ఆయన రాజకీయమే […]

Advertisement
Update:2020-01-30 07:14 IST

ఏదో చేస్తాడనుకుంటే..ఏదేదో చేస్తున్నాడట..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆయన మాటలకు…. చేతలకు అసలు పొంతనే లేదని…అసలు కంటే కొసరు పనుల పైనే ఫోకస్ పెట్టారంటూ రేవంత్‌పై సొంత కేడరే చెవులు కొరుక్కుంటోందట.

ఈయనకు తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలపైనే మక్కువ ఎక్కువైందని…. సొంత నియోజకవర్గంలోని తన కేడర్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉంటే… పక్కరాష్ట్ర ముచ్చట్లు మనకెందుకు అంటోందట రేవంత్ అనుచరవర్గం.

రేవంత్ రెడ్డి.. తెలంగాణలో మంచి వాగ్దాటి కలిగిన నేత. ఆయన రాజకీయమే దూకుడుగా ఉంటుంది. టీడీపీలో ఇలా ప్రవేశించి అలా అల్లుకుపోయారు. ఎంతలా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నేతలనే కాదనుకునేంత. ఆయన వాగ్దాటి కారణంగానే కాంగ్రెస్ పార్టీ… పార్టీలో చేరిన కొన్నాళ్లకే కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ను ఆయన భుజాలపై పెట్టింది.

కానీ అనుకున్నంత స్థాయిలో రేవంత్ రాజకీయం సాగడం లేదు. నిన్నటికి నిన్న జరిగిన ఎన్నికల్లోనూ బొక్కా బోర్లాపడ్డారు రేవంత్. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో ఆయన ప్రభావం… మరింత కరిగిపోతోంది. అక్కడ కారు జోరు ముందు రేవంత్ మరింత బేజారవుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో… గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ.. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులే షాక్ అయ్యాయి.

అయితే రేవంత్‌కు ఈ బాధ కంటే.. పక్క రాష్ట్రం బాధలే ఎక్కువయ్యాయట. అసలే ఓడి కేడర్ నిరుత్సాహంలో ఉంటే…ఉత్సాహ పరిచే మాటలు చెప్పాల్సింది పోయి… ఉసూరుమనే విషయాలు చెప్పుకుంటూ పోతున్నాడని వాపోతున్నారట.

అసలే చంద్రబాబు బంటు అన్న ట్యాగ్ లైన్ వేలాడుతూనే ఉంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతుపై మాట్లాడాల్సిన అవసరమేంటని గుసగులాడుతున్నారు. ఇదే కేసీఆర్‌కు ప్లస్ అవుతోందని వాపోతున్నారట. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా.. భారతీయ పౌరుడిగా బాధగా ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించడంపై సొంత కేడరే అభ్యంతరం వ్యక్తం చేస్తోందట.

ఎంత లేదన్నా తెలంగాణలో వైఎస్‌, జగన్ కు అభిమానులున్నారు. కేసీఆర్‌ – జగన్‌ ల దోస్తీ ఎన్నికల ముందు నుంచే కొనసాగుతోంది. దీంతో ఈ అభిమానులంతా కారు గుర్తు వైపే కదిలారు. కేసీఆర్‌కే జై కొట్టారు.

చంద్రబాబుకు బంటుగా ఉన్నాడన్న ప్రచారంతో… తెలంగాణలో రేవంత్‌ ఇమేజ్‌… రవ్వంత రవ్వంతగా కరిగిపోతోంది. ఇది కేడర్ గమనించింది కానీ.. ఇంకా రేవంత్ పట్టించుకున్నట్లు లేదు.

అడపా దడపా… ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ… ఇక్కడ మైనస్‌గా మారుతున్నాడంటూ సొంత వాళ్లే అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రేవంత్ చంద్రబాబు మాయ నుంచి బయటపడకుంటే….అసలుకే మోసం వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ పగ్గాలు చేపట్టేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్‌…ఇలాంటి కామెంట్స్‌తో వెనకబడిపోతారని… రేవంత్‌ మారాలంటూ సొంత కేడరే భావిస్తోందట.

Tags:    
Advertisement

Similar News