అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి
తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? అని ఎమ్మెల్సీ ప్రశ్న
అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ మీడియా సమావేశంపై ఆయన స్పందించారు. అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నాం. ఆయన సినిమా హాల్‌లో ఎంత సేపు ఉన్నారో? వెళ్లేటప్పుడు ఎలా వెళ్లారో ఫుటేజ్ ఉన్నది. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? రేవతి చనిపోయిన మరుసటి రోజు ఆయన ఇంటి వద్ద టపాసులు కాల్చారు.
ఆయన థియేటర్ వద్ద ఎలా ప్రవర్తించారు, తర్వాత రోజు వారి ఇంటి వద్ద ఎలా వ్యవహరించారో వీడియో ఫుటేజ్‌లో ప్రజలంతా చూశారు. రేవతి మృతికి సానుభూతి ప్రకటించి, బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండదండగా ఉంటుందని సీఎం రేవంత్ అసెంబ్లీ చెబితే.. అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సీఎం ప్రజలకు ధైర్యం, భరోసా కల్పించారు. దీనికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చంది? ఇప్పటికైనా జరిగిన ఘటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని బల్మూరి వెంకట్ సూచించారు.