కాళేశ్వరంపైకక్ష.. పాలమూరు-రంగారెడ్డికి ఉరిశిక్ష
వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభా సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా పోయిన ప్రభుత్వమని కేటీఆర్ ఎద్దేవా
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు ఉండేదని, కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు-రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టుల డీపీఆర్ జలవనరుల శాఖ వెనక్కి పంపడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాళేశ్వరంపై అర్ధం లేని కక్ష.. పాలమూరు-రంగారెడ్డికి ఉరిశిక్ష అని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ నోరు తెరవడం లేదని, పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించడానికి కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్‌లో చలనం లేదని కేటీఆర్ అన్నారు. వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభా సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా పోయిన ప్రభుత్వం రుణమాఫీ కాని రైతన్నలకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి, అడవుల తల్లి ఆదిలాబాద్‌లో రైతుల ముందే మాయ లెక్కలు తేలుద్దామన్నారు.