ఆయనకు మంత్రి పదవి... ఈటెలకు చెక్ పెట్టేందుకేనా ?
ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గులాబీ పార్టీ అడ్డా. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు ఈ జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉంటే టీఆర్ఎస్ 11 సీట్లు గెలిచింది. ఒక సీటు టీఆర్ఎస్ రెబల్ గెలిచారు. ఆతర్వాత ఆయన అధికార పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ […]
ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గులాబీ పార్టీ అడ్డా. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు ఈ జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది.
2018 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉంటే టీఆర్ఎస్ 11 సీట్లు గెలిచింది. ఒక సీటు టీఆర్ఎస్ రెబల్ గెలిచారు. ఆతర్వాత ఆయన అధికార పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ 12 సీట్లు గెలిచింది.
మొత్తానికి అండగా ఉంటున్న కరీంనగర్ జిల్లాకు ఈ సారి నాలుగు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో కేటీఆర్, గంగుల కమలాకర్‌కు మంత్రి పదవులు దక్కాయి. దీంతో కరీంనగర్ జిల్లా నుంచి నలుగురికి మంత్రి పదవులు వచ్చినట్లు అయింది.
విభజన జిల్లాల ప్రకారం చూసుకుంటే కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, సిరిసిల్ల నుంచి ఒకరు, పెద్దపల్లి జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. అయితే మున్నూరు కాపు కోటాలో గంగుల కమలాకర్ కు మంత్రి పదవి వచ్చింది. అయితే ఈయనకు దూకుడు ఎక్కువ. కరీంనగర్ జిల్లాలో ఈటెలకు చెక్ పెట్టేందుకే గంగులకు మంత్రి పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. సైలెంట్‌గా ఉండే ఈటెలను గంగుల తన దూకుడుతో కమ్మేస్తారని గులాబీ హైకమాండ్ అంచనా.
మరోవైపు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. ఆయనది మున్నూరు కాపు సామాజికవర్గమే. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్‌తో పాటు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణదీ ఒకే సామాజికవర్గం. రాబోయే రోజుల్లో ఈ సామాజికవర్గం అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకే గంగులకు పదవి ఇచ్చారని మరో కారణంగా చెబుతున్నారు.
మొత్తానికి బీజేపీ బూచి, ఈటల ఎఫెక్ట్ గంగులకు కలిసి వచ్చింది. మంత్రి పదవి వరించింది.