ఏపీలో దంచేస్తున్న వర్షాలు... శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరవళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించేది ఈ జిల్లా మీదుగానే అయినా అనంతపురం జిల్లాలో […]
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి.
ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించేది ఈ జిల్లా మీదుగానే అయినా అనంతపురం జిల్లాలో మేఘాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి నేల దిగకుండా ముందుకు సాగిపోతున్నాయి.
గడిచిన రెండు రోజుల్లోనే ఏపీలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షపాతం నమోదు అయింది. ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే 4.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
అటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల వైపు ఉరకలెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నిండిపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు వదులుతున్నారు. జూరాల నుంచి 2 లక్షల 8వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 838 అడుగులుగా ఉంది. రోజుకు 18 టీఎంసీల నీరు శ్రీశైలంలోకి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని నీరు చుట్టుముట్టింది. దాంతో ఆలయంలో పూజలు నిర్వహించి మూసివేశారు. తిరిగి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన తర్వాత ఈ ఆలయం పూజలందుకుంటుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండడంతో రానున్న రెండు రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అంచనా వేసింది. రాష్ట్రంలో ఐదారు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.