ఫిరాయింపులపై జగన్ నిర్ణయం భేష్... సర్వత్రా అభినందనలు..!
ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించడాన్ని తాను ప్రోత్సహించనని, ఎవరైనా అధికార పార్టీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేస్తే తప్ప… తమ పార్టీలోకి ప్రవేశం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తనకు తెలియకుండా ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా అలాంటి […]
ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించడాన్ని తాను ప్రోత్సహించనని, ఎవరైనా అధికార పార్టీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేస్తే తప్ప… తమ పార్టీలోకి ప్రవేశం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.
శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తనకు తెలియకుండా ఎప్పుడైనా పొరపాట్లు జరిగినా అలాంటి సభ్యులను స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని శాసనసభలోనే ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల తర్వాత వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.
ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ట్వీట్ చేశారు. “ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నఈ నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెంపపెట్టులాంటిది” అని విజయశాంతి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ కూడా అభినందించారు. రాజకీయ పార్టీలలో నానాటికీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అద్భుతమైనదని, సాహసోపేత నిర్ణయం అని అన్నారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే… దేశంలో మంచి రాజకీయ వ్యవస్థ వస్తుందని నారాయణ అభిప్రాయపడ్డారు. భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ఇలాంటి నిర్ణయాలతో ప్రక్షాళన చేయవచ్చునని నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం ప్రశంసిచడం గమనార్హం. ఏపీ సిఎం పార్టీ ఫిరాయింపులపై తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నామని తెలంగాణ సిఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
“ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చేర్చుకోవాలి” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ రాజకీయ విలువలను పెంపొందిస్తూంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని దిగజారుస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.