మిరకిల్ మిగ్ విమానాలు
చీఫ్ అండ్ బెస్ట్ మిగ్ ఫైటర్ జెట్స్ గత 50 ఏళ్లుగా భారత వైమానికదళానికి దన్నుగా మిగ్ ఫైటర్లు ధర తక్కువ.. ఉపయోగాలు ఎక్కువ మిగ్ ఒక్కో ఫైటర్ జెట్ ధర 14 కోట్ల రూపాయలు పిట్టకొంచెం ..కూతఘనం అన్నమాట…భారత వైమానిక దళానికి చెందిన మిగ్ ఫైటర్ జెట్ విమానాలకు అతికినట్లు సరిపోతుంది. పాకిస్థాన్ ఏర్ ఫోర్స్ కు చెందిన అత్యాధునిక F-16 ఫైటర్ జెట్ ను… మన మిగ్ -21 బైసన్ విమానమే కూల్చడం ద్వారా […]
- చీఫ్ అండ్ బెస్ట్ మిగ్ ఫైటర్ జెట్స్
- గత 50 ఏళ్లుగా భారత వైమానికదళానికి దన్నుగా మిగ్ ఫైటర్లు
- ధర తక్కువ.. ఉపయోగాలు ఎక్కువ
- మిగ్ ఒక్కో ఫైటర్ జెట్ ధర 14 కోట్ల రూపాయలు
పిట్టకొంచెం ..కూతఘనం అన్నమాట…భారత వైమానిక దళానికి చెందిన మిగ్ ఫైటర్ జెట్ విమానాలకు అతికినట్లు సరిపోతుంది. పాకిస్థాన్ ఏర్ ఫోర్స్ కు చెందిన అత్యాధునిక F-16 ఫైటర్ జెట్ ను… మన మిగ్ -21 బైసన్ విమానమే కూల్చడం ద్వారా అందరి దృష్టి ఆకట్టుకొంది. ఇప్పుడు అందరూ మిగ్ విమానాల కథాకమామిషు ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.
కాస్ట్లీ వార్….
ఆధునిక సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ విమానాలు అనగానే… రాఫెల్, మిరాజ్, ఎఫ్-16, సీ- హారియర్స్, సుఖోయ్, మిగ్ -35 లాంటి ఫైటర్ జెట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి.
వందల కిలోల బరువున్న బాంబులు, మిసైల్స్ ను మోసుకొంటూ… గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ విమానాల ధర అంతాఇంతా కాదు.
ఎఫ్-16 ఫైటర్ ధర 770 కోట్లు… మిగ్ ఫైటర్ ధర 14 కోట్లు…
అమెరికా తయారు చేసే F-16 మల్టీపుల్ ఫైటర్ జెట్ విమానం ఖరీదు 770 కోట్ల రూపాయలు. అదే రష్యాలో తయారైన సుఖోయ్ -30 ఫైటర్ జెట్ల ఖరీదు 300 కోట్ల రూపాయలు గా ఉంది.
అదే… సోవియెట్ యూనియన్ లైసెన్సుతో…. భారత్ తయారు చేస్తున్న మిగ్ -21 బైసన్ బ్రాండ్ జెట్ ఫైటర్ ఖరీదు 14 కోట్లు రూపాయలు మాత్రమే.
50 సంవత్సరాలుగా మిగ్ ఫైటర్ సేవ….
భారత వైమానిక దళానికి గత అర్ధశతాబ్దకాలంగా సేవలు అందిస్తూ వస్తున్న మిగ్ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ విమానాలకు….చీఫ్ అండ్ బెస్ట్ ఫైటర్ బాంబర్ గా పేరుంది.
1967 నుంచి భారత వైమానిక దళానికి అసమాన సేవలు అందించిన… అందిస్తూ వస్తున్న మిగ్ యుద్ధవిమానానికి… లైట్ వెయిట్ ఫైటర్ గా కూడా గుర్తింపు ఉంది.
ఇండియన్ ఏయిర్ ఫోర్స్ లో… ప్రస్తుతం 113 మిగ్ జెట్ ఫైటర్లు ఉంటే… వీటిలో 110 విమానాలను అత్యాధునిక టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేస్తూ వచ్చారు.
1959లో మిగ్ తొలివిమానం…
ప్రస్తుత రష్యా… అలనాటి సోవియెట్ యూనియన్ లోని … మికాయిన్-గురేవిచ్ సంస్థ డిజైన్ తో మిగ్ ఫైటర్లు తయారు చేసి… 1959లో తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ సోవియెట్ యూనియన్, చెకోస్లవేకియా, భారత్ కలసి మొత్తం 2వేల మిగ్ విమానాలను తయారు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాయి.
ప్రపంచంలో… ఆర్థికస్థోమత అంతగాలేని దేశాలకు… అందుబాటులో ఉండే విధంగా రూపొందించినవే మిగ్ ఫైటర్ జెట్ సూపర్ సోనిక్ విమానాలు. యుద్ధవిమానాల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో తయారు చేసినవి…. మిగ్ విమానాలు మాత్రమే.
డాగ్ ఫైటర్ గా మిగ్ రికార్డు…
అంతేకాదు…గగనతల యుద్ధంలో మెరికలా దూసుకుపోయి…శత్రుదేశాల ఫైటర్ జెట్లను తరితరిమి కొట్టడంలో…మిగ్ విమానాలకు గొప్ప రికార్డే ఉంది. నాలుగు ఖండాలకు చెందిన 60 దేశాల విమానదళాలకు …ప్రస్తుతం మిగ్ ఫైటర్ జెట్లు సేవలు అందిస్తున్నాయి.
మిగ్ విమానాలను …కాలానుగుణంగా ఆధునీకరిస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్ తయారీ మిరాజ్ విమానలలో ఉపయోగిస్తున్న టెక్నాలజీతో… మిగ్ ఫైటర్లను సైతం అప్ గ్రేడ్ చేస్తూ భారత వైమానిక దళం…. మనుగడ సాగిస్తూ వస్తోంది.
కార్గిల్ యుద్ధంలో మిగ్ తడాఖా….
ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ కు… చైనా, పాకిస్థాన్ శత్రుదేశాలుగా ఉన్నాయి. కేవలం …ఆత్మరక్షణ కోసమే భారత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో వైమానికదళాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాల్సి వస్తోంది.
పాకిస్థాన్ తో 1971, 1999 కార్గిల్ యుద్ధాలలో మిగ్ ఫైటర్లనే భారత్ ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించింది.
అమెరికాకు పీడకల మిగ్ ఫైటర్లు….
అంతేకాదు… అగ్రరాజ్యం అమెరికా దళాలతో… వియత్నాం జరిపిన మహాయుద్ధంలో సైతం…మిగ్ ఫైటర్ జెట్లే హీరోలుగా నిలిచాయి. వందకు పైగా అమెరికా యుద్ధవిమానాలను కూల్చిన ఘనత అలనాటి… వియత్నాం వైమానికదళంలోని మిగ్ ఫైటర్ జెట్లకు మాత్రమే దక్కుతుంది.
మిగ్ 50 ఏళ్ల వేడుకలు
భారత వైమానిక దళానికి మారుపేరుగా నిలిచిన మిగ్ విమానాలు…2013లోనే 50 సంవత్సరాల వేడుకలను జరుపుకొన్నాయి. అయితే… మిగ్ విమానాల టెక్నాలజీకి కాలం చెల్లడంతో… భారత వైమానిక దళం… మిగ్ విమానాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
గత 50 సంవత్సరాల కాలంలో 1200 వరకూ మిగ్ విమానాలను తయారు చేసిన భారత్… 2020 సంవత్సరం నాటికి…మిగ్ విమానాలను దశలవారీగా ఉపసంహరించుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
2020లో మిగ్ ఫైటర్ల రిటైర్మెంట్…
గత ఐదు దశాబ్దాలుగా…భారత వైమానిక దళానికి చిరస్మరణీయ సేవలు అందించిన మిగ్ విమానాలు…2020 నాటికి… తెరమరుగైనా… వాటిస్థానంలో అత్యాధునిక రాఫెల్ జైట్ ఫైటర్లు వచ్చినా… మిగ్ విమానాల చరిత్ర, సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.