బాబుకు చెప్పకండి.... శంకుస్థాపన చేసేస్తారు

“ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించే లోగా విశాఖ రైల్వే జోన్ ప్రకటన వస్తుంది. ఈ విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పకండి. అక్కడికి వచ్చేసి శంకుస్థాపన చేసేస్తారు. లేదూ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అమరావతి నుంచి శంకుస్థాపన కానిచ్చేస్తారు” ఇదీ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట. కేంద్రం ప్రాజెక్టులను ప్రకటించడానికి ముందే వాటి గురించి వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు […]

Advertisement
Update:2019-02-24 23:33 IST

“ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించే లోగా విశాఖ రైల్వే జోన్ ప్రకటన వస్తుంది. ఈ విషయం దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పకండి. అక్కడికి వచ్చేసి శంకుస్థాపన చేసేస్తారు. లేదూ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అమరావతి నుంచి శంకుస్థాపన కానిచ్చేస్తారు” ఇదీ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట.

కేంద్రం ప్రాజెక్టులను ప్రకటించడానికి ముందే వాటి గురించి వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుని శంకుస్థాపనలు చేసేస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. పనులు ప్రారంభం కాని, టెండర్లు కూడా ఇంకా పిలవని పనులకు సైతం చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు వెక్కిరించారు.

“ భోగాపురం విమానాశ్రయం చూశారు కదా! దానికి టెండర్లు లేవు… అనుమతులు లేవు.. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడకు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇక కడప స్టీల్ ప్లాంట్ సంగతి సరే సరి. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేవు… అసలు ఆ ప్రాజెక్టు వస్తుందనే నమ్మకం లేదు. అయినా ఏదో చేస్తున్నట్లుగా అక్కడికి వెళ్లి శంకుస్థాపన చేసేసారు. విశాఖ రైల్వేజోన్ గురించి కూడా చంద్రబాబుకు చెప్పకండి ప్లీజ్” అని విష్ణుకుమార్ రాజు మీడియాను కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన విరుచుకుపడ్డారు. భీమిలి నుంచి పోటీచేసి గెలుస్తానని గంటా శ్రీనివాసరావు ఆశిస్తున్నారని, అయితే ఈసారి గెలిచే అవకాశాలు తక్కువేనని విష్ణుకుమార్ రాజు అన్నారు.

“అవంతి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని పత్రికల్లో చదివాను. ఆయన వచ్చారంటే ఇక గంటా శ్రీనివాసరావు గెలవడం అసాధ్యం” అని ఆయన అన్నారు. విశాఖ భూములను బినామీ పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు మింగేసారు అని, వీటి మీద వేసిన సిట్ నివేదిక బయటకు వస్తే అందరి గురించి నిజాలు వెలుగులోకి వస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు.

“ సిట్ నివేదికని వెలుగులోకి తీసుకు రండి. ఎవరేంటో వెంటనే తెలిసిపోతుంది. ఎవరెవరు విశాఖ భూములు కొట్టేశారో సిట్ నివేదికలో స్పష్టంగా ఉంది” అని బిజెపి నేత అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయకుండా ఊరుకోవడం లేదని రాజు మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News