అధ్యక్షా.... అనేందుకు జానారెడ్డి కొత్త ప్లాన్ !
తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల వేట మొదలైంది. కొందరు సీనియర్ నేతలు ఎంపీగా పోటీ చేయాలనే ప్లాన్ వేస్తున్నారు. మరికొందరు నేతలు ఎలాగైనా ఏదైనా పదవి దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. కాలం కలిసి వస్తే ఎంపీ కాకపోతామా? అనే ఆశల పల్లకిలో ఊరుగేతున్నారు. మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారు. కుదిరితే నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే ఇదే సీటుపై మాజీ ఎమ్మెల్యే […]
తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల వేట మొదలైంది. కొందరు సీనియర్ నేతలు ఎంపీగా పోటీ చేయాలనే ప్లాన్ వేస్తున్నారు. మరికొందరు నేతలు ఎలాగైనా ఏదైనా పదవి దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. కాలం కలిసి వస్తే ఎంపీ కాకపోతామా? అనే ఆశల పల్లకిలో ఊరుగేతున్నారు.
మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారు. కుదిరితే నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే ఇదే సీటుపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్ను కూడా పడింది. వీరిద్దరితో పాటు సూర్యాపేట నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డి కూడా లోక్‌సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారని ఆయన అంటున్నారు. నల్గొండ ఎంపీ టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.
ఇక్కడే జానారెడ్డి ఓ పక్కా ప్లాన్ వేశారు. పార్టీలో తాను సీనియర్ లీడర్. ఇస్తే నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి. లేకపోతే అధ్యక్షా అనేందుకు మరో ఆప్షన్ ఉందని అంటున్నారు. కోమటిరెడ్డికి లేదా వేరే వారికి ఎంపీ టికెట్ ఇస్తే తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కకపోదా? అనేది జానా ఆలోచన.
ఏప్రిల్ ఒకటో తేదీ కల్లా శాసనమండలిలో 16 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటా కింద 7, స్థానిక సంస్థల కోటాలో 5, టీచర్స్ కోటాలో 2, గవర్నర్ కోటాలో 1. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక స్థానం ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది. ఈ సీటుపై కర్చీప్ వేసేందుకు జానారెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది
కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంటే ఎమ్మెల్యే కోటాలో ఒక్క ఎమ్మెల్సీ సీటు దక్కుతుంది. ఒకవేళ లోక్‌సభ సీటు దక్కకుంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు పై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ తీసుకోవాలనే ఆలోచనలో జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జానారెడ్డి ఒక్కరే కాదు. మార్చితో ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనున్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణ,గీతారెడ్డి, సంపత్‌కుమార్, మర్రిశశిధర్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఈ ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ ఎమ్మెల్సీ సీటు పోరు తెరపైకి రావడంతో పీసీసీ నాయకత్వానికి సమస్యగా మారింది.