రాష్ట్రానికి రేవంత్ గ్రహణంలా పట్టాడు
కాంగ్రెస్ వైఫల్యంతో పంటలు ఎండుతున్నాయని..ప్రకృతి వైపరీత్యం కాదన్న మాజీ మంత్రి హరీశ్‌రావు;
కాంగ్రెస్ వైఫల్యంతో పంటలు ఎండుతున్నాయని..ప్రకృతి వైపరీత్యం కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాలం మంచిగ అయ్యిందని, కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయన్నారు. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. ముఖ్యమంత్రికి పాలించే దక్షత లేదని రేవంత్ రెడ్డికి గ్రహణం పట్టిందని ధ్వజమెత్తారు. నాడు కేసీఆర్ ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితే నేడు రేవంత్ రెడ్డి వదిలిపెడుతున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా..రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రేవంత్ అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టాయి. కానీ ఆనాడు ఎందుకు పంటలు ఎండలేదు? ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయి? అని ప్రశ్నించారు. మండుటెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవి. ఒక ఎకరం కూడా ఎండకుండా కేసీఆర్ పాలనలో పంట పండింది. పాలన చేతకాక ప్రకృతి పైన, ప్రతిపక్షాల పైన నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని ధ్వజమెత్తారు. దేవాదుల ఫేజ్-3 సత్వరమే ప్రారంభించి పంటలను కాపాడాలన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.