ఓటర్ల జాబితాలో అవకతవకలపై పార్లమెంటులో చర్చ జరగాలి

దేశ సమగ్రతను ప్రభావితం చేసే ఈ అంశంపై చర్చ అవసరమని కాంగ్రెస్‌ డిమాండ్‌;

Advertisement
Update:2025-03-10 19:50 IST

ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమగ్ర చర్చ జరగాలని పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షాలన్నీ ఇదే డిమాండ్‌ చేస్తున్నాయని తెలిపింది. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించారు. అన్నిరాష్ట్రాల్లోని ఓటర్‌ కార్డుల్లో పెద్ద ఎత్తున రెండుసార్లు వివరాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఈసీనే స్వయంగా ఒప్పుకున్నదని ఖర్గే చెప్పారు. ఇవి ఓటర్‌ సమగ్రతను, ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఓటర్ల జాబితాలోని అవకతవకలపై తక్షణమే చర్చ అవసరమని ఖర్గే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర ఓటర్‌ జాబితాలో అవకతవకలు జరిగాయని నెలరోజుల నుంచి తాము ఆరోపిస్తున్నా.. ఎలాంటి స్పందన రాలేదని రాహుల్‌ ఆక్షేపించారు. ఓటర్ల జాబితాను ప్రభుత్వం తయారు చేయదనే వ్యాఖ్యలను సమర్థిస్తూనే.. దీనిపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ పారదర్శకతపై తమ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలను కాపాడటానికి ఓటర్ల జాబితాపై చర్చ చాలా ముఖ్యమన్నారు.

లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాను ప్రభుత్వం తయారు చేయదని నిజం చెప్పారు. కానీ దేశం మొత్తం ఓటర్ల జాబితాను ప్రశ్నిస్తున్నది. అన్నిరాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ ప్రతిపక్షాలు ఓటర్ల జాబితాను సవాల్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితాలోని అవకతకలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలన్నీ కలిసి కోరుతున్నాయి. మీరు ఓటర్ల జాబితాను తయారు చేయరని మేము అంగీకరిస్తున్నాం. కానీ దీనిపై చర్చ పెట్టండి అన్నారు.

అయితే ఈసీ ఈ వ్యవహారంపై స్పందించినట్లు తెలుస్తోంది. డూప్లీకేట్‌ ఓటర్‌ కార్డు నంబర్ల వ్యవహారమనేది అనేక సంవత్సరాలుగా ఉన్నదని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ అధికారంలో లేని 2008-13 సమయంలోనూ ఇటువంటి కార్డులు జారీ అయ్యాయని వెల్లడించినట్లు సమాచారం. 

Tags:    
Advertisement

Similar News