షిల్లాంగ్.... వేళ్ల వంతెన.... వీపుకు బుట్ట
షిల్లాంగ్… మేఘాలయకు రాజధాని. సాధారణంగా ఒక రాష్ట్రానికి రాజధాని నగరం అంటే విమానాశ్రయం ఉంటుందనుకుంటాం. కానీ ఇది మేఘాలయ. మేఘాల నివాసం, పర్వతాల నిలయం. ఇక్కడ ఎయిర్‌పోర్టు లేదు. షిల్లాంగ్ చేరాలంటే పొరుగు రాష్ట్రం అస్సాం రాష్ట్రంలోని గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గాన ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే దారిలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కొండ చీపురు ఇక్కడిదే! మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ […]
షిల్లాంగ్… మేఘాలయకు రాజధాని. సాధారణంగా ఒక రాష్ట్రానికి రాజధాని నగరం అంటే విమానాశ్రయం ఉంటుందనుకుంటాం. కానీ ఇది మేఘాలయ. మేఘాల నివాసం, పర్వతాల నిలయం. ఇక్కడ ఎయిర్‌పోర్టు లేదు.
షిల్లాంగ్ చేరాలంటే పొరుగు రాష్ట్రం అస్సాం రాష్ట్రంలోని గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గాన ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే దారిలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది.
కొండ చీపురు ఇక్కడిదే!
మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలు విస్తారంగా కనిపిస్తాయి.
కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టుకుచ్చులా మెత్తగా ఉండే చీపుర్లను మనం కొండచీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే.
కొండల మీద ఇళ్లు
కొండల మీద నివాసం, కొండవాలులో వ్యవసాయం ఇక్కడి ప్రత్యేకత. లోయల్లో నదులు ప్రవహిస్తుంటాయి. ఇక్కడి ప్రజలు ప్రకృతిని పరిరక్షించుకుంటూ జీవిస్తారు. వీళ్ల డిసిప్లిన్ అంతా వాహనాలను నడిపేటప్పుడు కనిపిస్తుంది.
ఎన్ని వాహనాలున్నా సరే మిలటరీ డిసిప్లిన్ పాటిస్తున్నట్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణిస్తాయి తప్ప ఓవర్‌టేక్ చేయడం ఉండదు. అనవసరంగా హారన్ కొట్టడం కూడా ఉండదు. పనిలో చూపించినంత శ్రద్ధ సెలవు తీసుకోవడంలోనూ కనిపిస్తుంది.
ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయరు. ఎక్కడో ఒక స్వీట్ షాప్ తప్ప మరే దుకాణమూ తెరిచి కనిపించదు. ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ. ఆదివారం పనికి సెలవు తీసుకుని చర్చిలకు వెళ్తారు.
ఎత్తు తక్కువ!
మేఘాలయ మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ధైర్యసాహసాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే మనుషులు ఎత్తు తక్కువ. దాంతో మిలటరీలో చేరాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ వారికి అవకాశం ఉండదు.
వాళ్ల కళ్ల ముందు మిలటరీ బేస్‌లలో కనిపించే ఉద్యోగులను చూస్తూ, తమ ఎత్తును తలుచుకుని బాధపడుతుంటారు కూడా. ఇక్కడి ఎయిర్‌ఫోర్స్ బేస్ పాయింట్‌కి వెళ్తే షిల్లాంగ్ నగరం మొత్తం కనిపిస్తుంది.
హ్యాంగింగ్ బాస్కెట్
ఇక్కడి వాళ్లు వీపుకు బుట్ట తగిలించుకున్నారంటే పని మీద బయటకు వెళ్తున్నారని అర్థం. తలకు చుట్టచుట్టినట్లు కట్టుకుంటారు. ఆ చుట్ట నుంచి తాడుతో కట్టిన బుట్టను వీపు మీద వేళ్లాడ దీసుకుంటారు.
కొండ మీదున్న ఇళ్ల నుంచి బయలుదేరి కొండవాలులో ఉండే పంట పొలాల్లోకి నడుస్తూ పోవడం చూస్తుంటే వీళ్లు పని చేయడానికే పుట్టారా అనిపిస్తుంది. ప్రతిదీ పూర్తి శ్రద్ధతో చేస్తున్నట్లు కనిపిస్తారు. పొలానికి వెళ్లే నడక కూడా.
కొండవాలు కావడంతో ఒకరి పక్కన మరొకరు నడవడానికి కుదరదు. నలుగురైదుగరు కలిసి బయల్దేరినప్పటికీ ఒకరి వెనుక ఒకరు నడవాల్సిందే. దాంతో నడిచేటప్పుడు కబుర్లు ఉండవు. దాంతో వాళ్లు పొలానికి వెళ్తున్న దృశ్యం చూస్తుంటే దూరానికి తదేక దీక్షతో నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
ఉమియా లేక్… వేళ్ల వంతెన
గువాహటి నుంచి షిల్లాంగ్‌కి వెళ్లేటప్పుడు షిల్లాంగ్‌కి పదిహేను కిలోమీటర్ల ముందే ఉమియా లేక్ పలకరిస్తుంది. ఈ నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నేల కనిపిస్తూ ఉంటుంది.
నది ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరడానికి కింద వంతెన మీద నడిచి వెళ్తుంటారు. వర్షాలతో కింది వంతెన మునిగిపోయినప్పుడు పై అంతస్తులోని వంతెన మీద నడుస్తారు.
ఈ వేళ్లు చెట్లు నరికి తెచ్చినవి కాదు. చెట్ల నుంచి వేళ్లను దారాల్లా లాక్కు వచ్చి వంతెన అల్లుతారు. ఈ వేళ్లు నీటిని పీల్చుకుంటూ చెట్లకు అందిస్తుంటాయి కూడా.
రోడ్లు ఏటా వేయాల్సిందే
మేఘాలయలో రోడ్లను ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వెళ్లిన వాళ్లకు గతుకు రోడ్ల తిప్పలు తప్పవు. నవంబరు నుంచి రోడ్లు వేయడం మొదలవుతుంది.
డిసెంబరు, ఆ తర్వాత వెళ్తే మంచి రోడ్ల మీద ప్రయాణించ వచ్చు.
-మంజీర