రాజు... రాణి... ఓ రాకెట్... జోగ్ జలపాతం
రేలారే రేలా అని పాడుకుంటూ జోగారే… జోగా అని జలపాతంలో తడవడం సంతోషంగానే ఉంటుంది. అయితే ఈ జలపాతం కింద జలకాలాడడం కుదిరే పని కాదు. ఇది 830 అడుగుల జలపాతం. ఎత్తైన జలపాతాల జాబితాలో తన స్థానం ఎక్కడ ఉందోనని చూసుకుంటూనే ఉంటుంది. మేఘాలయలోని నోహకల్లికాయ్ ఫాల్స్ తర్వాత స్థానం తనదే అనే భరోసాతో ఉండేది. ఆ తర్వాత పరిశీలనల్లో దాని చుట్టు పక్కలే కంచికాల్ ఫాల్స్, బార్కానా ఫాల్స్ అని మరో రెండు జలపాతాలున్నాయని […]
రేలారే రేలా అని పాడుకుంటూ జోగారే… జోగా అని జలపాతంలో తడవడం సంతోషంగానే ఉంటుంది. అయితే ఈ జలపాతం కింద జలకాలాడడం కుదిరే పని కాదు. ఇది 830 అడుగుల జలపాతం. ఎత్తైన జలపాతాల జాబితాలో తన స్థానం ఎక్కడ ఉందోనని చూసుకుంటూనే ఉంటుంది.
మేఘాలయలోని నోహకల్లికాయ్ ఫాల్స్ తర్వాత స్థానం తనదే అనే భరోసాతో ఉండేది. ఆ తర్వాత పరిశీలనల్లో దాని చుట్టు పక్కలే కంచికాల్ ఫాల్స్, బార్కానా ఫాల్స్ అని మరో రెండు జలపాతాలున్నాయని తేల్చేశారు. కానీ టూరిజానికి అనువైన జలపాతం ఇది. దూరం నుంచి చూసి ఆనందించాల్సిన వాటర్‌ఫాల్స్. దీనిని చూడడానికి మరో కొండ మీదున్న వ్యూ పాయింట్ కి వెళ్లాలి.
చిన్న నది… ఎత్తైన జలపాతం
అంబుతీర్థ అనే ప్రదేశం నీటి మడుగు. ఆ మడుగులో నుంచి సాగే ప్రవాహమే శరావతి నది. రాముడు, సీత అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఈ పశ్చిమ కనుమల్లో విహరించారట. అప్పుడు సీతాదేవికి దాహంతో గొంతు ఎండిపోయిందట. అప్పుడు రాముడు తన ధనస్సును నేలకు ఎక్కుపెట్టి బాణం వదిలాడట. ఆ బాణం భూమిని చీల్చుకుని నీరు పైకి ఉబికి వచ్చిందట. అలా ఉబికి వచ్చిన నీటి చెలమే అంబుతీర్థ.
అంబు తీర్థ అంటే అంబు (బాణం) గుచ్చుకోవడంతో ఏర్పడిన నీటి చెలమ. ఇక శరావతి పేరుకు కూడా అదే కారణం చెబుతారు. శరం అంటే బాణం. బాణం వేయగా ఏర్పడిన నీటి చెలమ నుంచి సాగిన ప్రవాహం కాబట్టి శరావతి అనే పేరు వచ్చిందని అక్కడి గైడ్‌లు తాము చూసి వచ్చినంత నమ్మకంగా చెబుతారు.
ఆ శరావతి నది పశ్చిమంగా ప్రవహించి హోన్నోవర్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్యలో షిమోగ దగ్గర ఎత్తైన కొండల మీద నుంచి ఒక్కసారిగా నేల మీదకు ఉరుకుతుంది. అదే జోగ్ జలపాతం. కొండ శిఖరం మీద నుంచి లోయలోకి ఉరికే క్రమంలో నది నాలుగు పాయలుగా చీలిపోతుంది. జలపాతంలో మనకు కనిపించే పాయలు అవే. వాటి పేర్లు రాజా, రాణి, రాకెట్, రోర్. ఈ పేర్లు బ్రిటిష్ వాళ్లు పెట్టినవి. పులి గర్జనలా శబ్దం వచ్చే పాయకు రోర్ అని, నిలువుగా ఆకాశంలోకి వెళ్లే రాకెట్‌ను తలపిస్తున్న పాయకు రాకెట్ అని పెట్టారు. ప్రధానమైన పాయలకు రాజ, రాణి అని పెట్టారు.
డిసెంబరు బెస్ట్
ఇక్కడ సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కాబట్టి జోగ్ వాటర్ ఫాల్స్, శరావతి రివర్ వ్యాలీ వ్యూ, శరావతి వైల్డ్ లైఫ్ సాంక్చురీల్లో విహరించడానికి డిసెంబర్, జనవరి నెలలు అనువుగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి, ఆ తర్వాత కూడా వెళ్లవచ్చు కానీ జలపాతం ధార సన్నబడి పోతుంది. ఝమ్మనే శబ్దం లేకుండా జలపాతాన్ని చూసినా థ్రిల్ ఉండదు.
జోగ్ ఫాల్స్ ట్రిప్‌లో హోన్నోవర్ బీచ్‌ను కూడా కలుపుకోవచ్చు. అంబుతీర్థ నుంచి అరేబియా సముద్రం వరకు నదితోపాటు ప్రయాణించిన అనుభూతిని ఎంజాయ్ చేయవచ్చు. జోగ్ ఫాల్స్‌ను మధ్యాహ్నం తర్వాత చూడడం బాగుంటుంది.
సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు నీటి ధారల మీద ప్రతిబింబిస్తూ జలపాతం అందం ఇనుమడిస్తుంది. వ్యూ పాయింట్ నుంచి 1400 మెట్లు దిగితే రివర్ వ్యాలీ వ్యూ కు చేరుకోవచ్చు.
మొత్తానికి ఈ ట్రిప్‌లో ఒక పర్వత శిఖరం, జలపాతం, నది ప్రవాహం, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రివర్ వ్యాలీ, సముద్రతీరాలను చూడవచ్చు. షిమోగా నుంచి జోగ్ కు వెళ్లే దారిలో టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది.
కర్నాటక రాష్ట్రం, షిమోగా జిల్లాలో ఉన్న జోగ్ వాటర్ ఫాల్స్‌ని గైడ్‌లు జోగ్ పేరుతోనే వ్యవహరిస్తారు. స్థానికులు మాత్రం గెరుసొప్ప అంటారు.
-మంజీర