వయనాడు.... ఆకుపచ్చ బుగ్గచుక్క
కేరళలో టూర్ అనగానే నేరుగా అలెప్పీ, మునార్‌లు గుర్తుకువస్తాయి. ప్రకృతిలో మమేకం కావాలంటే వయనాడు మంచి ఆప్షన్. ఎత్తైన పర్వతాల నడుమ నీటి సరస్సులో విహరించాలంటే వయనాడు ది బెస్ట్ హనీమూన్ స్పాట్. వయనాడు చేరాలంటే కొచ్చికి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లడం ఒక పద్ధతి. అయితే రైల్లో వెళ్తే ప్రకృతి సౌందర్యాన్ని ఆసాంతం ఆస్వాదించవచ్చు. తమిళనాడులోని కోయంబత్తూరు దాటిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వేగమైన కథనంతో సాగే సినిమా రీళ్లలాగ […]
కేరళలో టూర్ అనగానే నేరుగా అలెప్పీ, మునార్‌లు గుర్తుకువస్తాయి. ప్రకృతిలో మమేకం కావాలంటే వయనాడు మంచి ఆప్షన్. ఎత్తైన పర్వతాల నడుమ నీటి సరస్సులో విహరించాలంటే వయనాడు ది బెస్ట్ హనీమూన్ స్పాట్. వయనాడు చేరాలంటే కొచ్చికి విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లడం ఒక పద్ధతి.
అయితే రైల్లో వెళ్తే ప్రకృతి సౌందర్యాన్ని ఆసాంతం ఆస్వాదించవచ్చు. తమిళనాడులోని కోయంబత్తూరు దాటిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వేగమైన కథనంతో సాగే సినిమా రీళ్లలాగ దృశ్యాలు మారిపోతుంటాయి.
కొబ్బరి చెట్లు ఆకాశాన్ని తాకడానికే పెరుగుతున్నట్లు ఉంటాయి. వాటి మధ్యలో అంతే ఎత్తులో కొన్ని చెట్లు కనిపిస్తాయి. అవి స్కేలు పెట్టి గీసిన లైన్‌లాగ సరళరేఖలా ఉంటాయి. అవి పోక (పోక వక్క) చెట్లు. ఆ కాయలు పెద్ద నిమ్మకాయంత ఉంటాయి, కొబ్బరి కాయ ఆకారంలో ఉంటాయి. ఒలిచి చూస్తే లోపల వక్క ఉంటుంది. స్టేషన్‌లలో భోజనం ఉంటుంది, కానీ చేపలు కామన్. వెజ్ భోజనం అని అడిగి తీసుకోవాలి.
ఇళ్లు కూడా మనకి కొత్తే
మధుకరై, ఎత్తిమడై స్టేషన్‌లు దాటే సరికి గ్రీనరీ ఒక్కసారిగా వచ్చి పడిన తుఫానులా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొబ్బరి చెట్లలోనూ తేడా కనిపిస్తుంది.
నిండా కాపుతో… పూలు, పళ్ల పళ్లేలను పట్టుకున్న పెళ్లి పేరంటాళ్లలా ఉంటాయి. విశాలమైన పొలం, మధ్యలో ఒక ఇల్లు. ఎవరి పొలంలో వాళ్లు ఇల్లు కట్టుకుంటారు. మనకు ఉన్నట్లు ఊరు ఒక చోట, పొలాలు ఒక చోట ఉండవు. తోట పక్కన మరొక తోట, ఆ తోటలో ఒక ఇల్లు… ఆ ఇళ్లకు ముదురు నీలం, గోల్డ్ స్పాట్ వంటి విచిత్రమైన రంగులు. పై కప్పు వాలుగా ఎర్ర పెంకుతో ఉంటుంది.
తరచుగా వచ్చే తుఫాన్‌లను తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నిర్మాణం. రెండంతస్థుల ఇళ్లకూ పెంకుల పై కప్పే ఉంటుంది. ఇదీ ఆ గ్రామాల ముఖచిత్రం. పిల్లలు స్కూలుకి నడిచిపోతుంటే… చూడడానికే బాధనిపిస్తుంది. అలా కిలోమీటర్లు నడిస్తే తప్ప స్కూలు రాదు మరి. తలస్నానం చేసి నీళ్లు కారుతున్న జుట్టుకి రిబ్బన్ కట్టుకుని వెళ్తుంటారు అమ్మాయిలు.
పశ్చిమ కనుమల సౌందర్యం
కోళికోద్ జిల్లాకు పొరుగున ఉంటుంది వయనాడు. ఇది మొత్తం హిల్ ఏరియా. ఏడు వేల అడుగుల ఎత్తున్న పర్వతం. వ్యాపారాలు కూడా పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని డెవలప్ అయినవే.
టూరిస్టులకు స్వాగతం పలుకుతూ హోర్డింగులు ఉంటాయి. వాటిలో ఎక్కువ హోటళ్ల హోర్డింగులే. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు మనకు అందేటంత దగ్గరగా కనిపిస్తాయి. కనుచూపు మేర అంతా పచ్చదనమే, వాటిలో లెక్కలేనన్ని షేడ్‌లు.
అన్నీ పచ్చగానే ఉన్నప్పటికీ దేని పచ్చదనం దానిదే. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకుల చెట్లు, మిరియాల తీగలు, లవంగాల చెట్లు ఎక్కువ. అక్కడక్కడా మామిడి, మరికొన్ని పండ్ల చెట్లుంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అందమైనవనే అభిప్రాయం నిజమేనని మరోసారి నిర్ధారణకు రావాల్సిందే ఎవరైనా.
కొండ మలుపులు మెడలు పట్టేస్తాయోమో అన్నంత దగ్గరగా ఉంటాయి. వాటిని హెయిర్‌పిన్ బెండ్ అంటారు. తొమ్మిదో హెయిర్‌పిన్ బెండ్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎటు చూసినా నేల కనిపించదు. నింగికీ – నేలకు మధ్యలో ఉంటాం.
దారి చూపిన దేవుడు
వయనాడు కొండ మీదకు వెళ్లే దారిలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. పెద్ద ఇనుప గొలుసులు కూడా ఉంటాయి. చెట్టు మొదట్లో ఒక రాయి, ఆ రాయికి పూజ చేసిన ఆనవాళ్లుంటాయి.
గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశంలో దారిని కనుక్కోవడానికి ఒక విదేశీయుడు వచ్చాడని, స్థానిక గిరిజనుడి సాయంతో అతడు పైకి చేరడానికి దారి కనుక్కున్నాడని, అయితే ప్రపంచానికి ఆ గిరిజనుడి పేరు తెలియకుండా ఉండడానికి విదేశీయుడు ఆ గిరిజనుడిని గొలుసులతో బంధించాడని, ఆ తర్వాత అతడు చనిపోయాడని చెబుతారు.
అక్కడి నుంచి ముందుకు వెళ్తే పూకాట్ లేక్‌ను చేరుతాం. అది మంచినీటి సరస్సు. బోట్ షికారు బావుంటుంది. హనీమూన్ కపుల్ కోసం పెడల్ బోట్లు కూడా ఉంటాయి. వేల అడుగుల ఎత్తులో నీటిలో విహరించడం నిజంగా అనిర్వచనీయమైన అనుభూతిగా మిగులుతుంది.
మూడు రాష్ట్రాల కొండలు…
పూకాట్ లేక్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీన్‌ముట్టి వాటర్ ఫాల్స్. జలపాతం దగ్గరకు వాహనాలు వెళ్లవు. అది ఎకో ఫ్రెండ్లీ జోన్. జలపాతం చేరడానికి రెండు కిలోమీటర్లు ట్రెకింగ్ చేయాలి.
ఆ దారిలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రతి టూరిస్టు తన వివరాలను నమోదు చేయాలి. పేరు, ఊరు, ఫోన్ నంబరు, తమ వారి వివరాలు, వాళ్ల ఫోన్ నంబరు కూడా రాయాలి.
ఆ జలపాతం దగ్గర ప్రమాదం సంభవిస్తే ఎవరికి తెలియచేయాలో ఆ వివరాలన్న మాట. అప్పటి వరకు ప్రయాణం సరదాగా ఉంటుంది కానీ, ఆ వివరాలు రాసేటప్పుడు మాత్రం ”ఏదైనా జరగరానిది జరిగితే” అని భయం వేస్తుంది. పర్యాటకులతో ఒక ఫారెస్ట్ ఉద్యోగిని తోడు పంపిస్తారు. వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లే కొద్దీ ఝమ్మనే శబ్దం తప్ప మరేమీ వినిపించదు. మూడు ఎత్తైన కొండల మధ్య జాలువారే జలపాతం అది. ఆ మూడు కొండలూ మూడు రాష్ట్రాలవి.
వయనాడు కేరళ, మరొకటి కర్నాటకు చెందిన కూర్గ్ కొండలు, మరోటి తమిళనాడుకు చెందిన కొండలు. ఒక రాష్ట్రం కొండ మీద నిలబడి మరో రాష్ట్రాల కొండలను చూడడం కూడా గొప్ప అనుభూతి. ఎక్కడైనా బావ గానీ వంగతోట కాడ కాదు… అన్నట్లు హనీమూన్ కపుల్ ఈ ట్రెకింగ్‌లో జలపాతాన్ని చేరే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మీన్‌ముట్టి జతపాతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని కాఫీ గింజలు, టీ ఆకులు, మిరియాల గుత్తులు కోసుకుని వయనాడు టూర్ జ్ఞాపకంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. మన దగ్గర ధాన్యం ఆరబోసినట్లు వయనాడులో ఇళ్ల ముందు కాఫీ గింజలు ఎండలో ఆరబోసి ఉంటారు. తేమ ఆరిన తర్వాత బస్తాల్లో నింపుతారు. పచ్చదనంలో వెచ్చదనం నిండిన ప్రదేశం వయనాడు. పర్యటన తీపిగర్తుగా మిగిలి తీరుతుంది.
-మంజీర