గుత్తాధిపత్యం దిశగా హిందుస్తాన్ యునీలివర్.... ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్ కూడా....
ఏ వ్యాపార రంగంలోనైనా గుత్తాధిపత్యం ప్రారంభమైతే వినియోగదారుడు నష్టపోవాల్సిందే. దేశంలో బీఎస్ఎన్ఎల్ (అప్పట్లో డాట్) ఒకటే టెలీఫోనీ సంస్థ ఉన్నప్పుడు కొత్త ఫోన్ రావాలంటే నెలల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చింది. కాని ఇప్పుడు ఇంటికే వచ్చి మొబైల్ సిమ్ ఇచ్చి వెళ్తున్నారు. అలాగే ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యం మంచిది కాదు. కాని దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో హిందుస్తాన్ యునీలివర్ గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. పైకి కనిపించేవి వేర్వేరు బ్రాండ్స్ అయినా అంతిమంగా దేశంలో […]
ఏ వ్యాపార రంగంలోనైనా గుత్తాధిపత్యం ప్రారంభమైతే వినియోగదారుడు నష్టపోవాల్సిందే. దేశంలో బీఎస్ఎన్ఎల్ (అప్పట్లో డాట్) ఒకటే టెలీఫోనీ సంస్థ ఉన్నప్పుడు కొత్త ఫోన్ రావాలంటే నెలల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చింది. కాని ఇప్పుడు ఇంటికే వచ్చి మొబైల్ సిమ్ ఇచ్చి వెళ్తున్నారు. అలాగే ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యం మంచిది కాదు.
కాని దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో హిందుస్తాన్ యునీలివర్ గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. పైకి కనిపించేవి వేర్వేరు బ్రాండ్స్ అయినా అంతిమంగా దేశంలో పాపులర్ అయిన 70 శాతం ప్రొడక్ట్స్ హిందూస్తాన్ యునీలివర్‌వే. మనం టీ కొనాలనుకుంటే రెడ్ లేబుల్, త్రీ రోజెస్, తాజ్ మహల్, లిప్టన్ గ్రీన్ టీ ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. కాని వాటిలో ఏది కొన్నా లాభపడే కంపెనీ ఒకటే. ఎందుకంటే అవి యూనీలివర్ బ్రాండ్లు. అలాగే వీల్ , సర్ఫ్ ఎక్సెల్, రిన్ అంటూ వేర్వేరు బ్రాండ్లతో వినియోగదారులకు చేరువైంది.
ఇక ఇప్పుడు ఈ సంస్థ పోషకాహార పానియాల విభాగంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోంది. ఇన్నాళ్లు పోషకాహార పానియాల విభాగంలో గ్లాస్కో స్మిత్‌క్లైమ్ (జీఎస్కే) కంపెనీకి చెందిన హార్లిక్స్, బూస్ట్, వీవా, మాల్టోవాలు ఆధిపత్యం చెలాయించేవి. దేశంలోని దాదాపు 80 శాతం మార్కెట్ ఈ నాలుగు బ్రాండ్లదే. ఇప్పుడు హెచ్‌యూఎల్ కంపెనీ ఈ నాలుగు బ్రాండ్లను జీఎస్కే నుంచి కొనుగోలు చేసింది.
31,700 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్‌కు రెండు కంపెనీలు ఆమోద ముద్ర వేశాయి. ఇకపై ఆ నాలుగు బ్రాండ్లు హెచ్‌యూఎల్ కిందకు వస్తాయి. జీఎస్కే వాటాదారులకు ప్రతీ ఒక్క షేరుపై 4.39 హెచ్‌యూఎల్ షేర్లను ఇస్తారు. ఈ మధ్య కాలంలో ఎఫ్ఎంసీజీ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్ ఇదే.
ఇప్పటికే తనకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో పలు చిన్న బ్రాండ్లను తొక్కేస్తున్న హెచ్‌యూఎల్…. ఇప్పుడు పాపులర్ బ్రాండ్స్ అయిన హార్లిక్స్, బూస్ట్ వంటి వాటిని మరింత వేగంగా వినియోగదారులకు చేరవేయనుంది. దీంతో చిన్న బ్రాండ్ల పరిస్థితి మరింత దయనీయ స్థితిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రజలకు అలవాటు అయిన ఈ ఉత్పత్తుల రేట్లు కూడా పెంచే అవకాశం ఉన్నట్లు వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.