ఎమ్మెల్యేపై స్టింగ్ ఆపరేషన్ వెనుక...

ఆవు చేనులో  మోసి కూడా దర్జాగా తిరుగుతున్నప్పుడు దూడలైన తామెందుకు నాలుగు ఆకులు చేనులోకి వెళ్లి తిరకూడదన్నట్టుగా టీడీపీ నేతల తీరు తయారైంది. అలాంటి వారిలో నెల్లూరు జిల్లా వెంకటగిరి పేరు గత రెండున్నరేళ్లుగా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ వినిపించడం ఇప్పుడు ఆడియో, టేపులతో సహా రుజువైంది. ఒక రైల్వే కాంట్రాక్టర్‌ ను ఎమ్మెల్యే ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. సదరు కంపెనీ ప్రతినిధులు కూడా ఎమ్మెల్యే రూ. 5 కోట్లు […]

Advertisement
Update:2016-09-27 16:30 IST

ఆవు చేనులో మోసి కూడా దర్జాగా తిరుగుతున్నప్పుడు దూడలైన తామెందుకు నాలుగు ఆకులు చేనులోకి వెళ్లి తిరకూడదన్నట్టుగా టీడీపీ నేతల తీరు తయారైంది. అలాంటి వారిలో నెల్లూరు జిల్లా వెంకటగిరి పేరు గత రెండున్నరేళ్లుగా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ వినిపించడం ఇప్పుడు ఆడియో, టేపులతో సహా రుజువైంది. ఒక రైల్వే కాంట్రాక్టర్‌ ను ఎమ్మెల్యే ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. సదరు కంపెనీ ప్రతినిధులు కూడా ఎమ్మెల్యే రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ వేధిస్తున్న మాట వాస్తవమేనని మీడియా ముఖంగానే చెప్పారు. అయితే సాధారణంగా ఏ కాంట్రాక్ట్ సంస్థ కూడా ఇలా అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధిపై బహిరంగ ఆరోపణలు చేసేందుకు సాహసించదు. అందులోనూ చంద్రబాబు లాంటి నేత ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో కాంట్రాక్టు పనులంటే అన్నింటికి సిద్ధపడే దిగాలన్న విషయం కాంట్రాక్టు సంస్థలకూ తెలుసు. కానీ ఒక కంపెనీ ధైర్యంగా ఇలా ఒక ఎమ్మెల్యేను ట్రాప్‌ చేసి బంధించడం వెనుక పెద్ద కథే ఉందని చెబుతున్నారు.

ఎమ్మెల్యేను ఇరికించిన మాంటెకార్లో కంపెనీ గుజరాత్‌కు చెందినది. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు పనులు చేసేందుకు అవకాశం దక్కించుకున్నప్పుడు కంపెనీ చాలా హ్యాపీగా ఫీలైందని చెబుతున్నారు. చంద్రబాబు బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం, గుజరాత్‌కే చెందిన మోదీ ప్రధానిగా ఉండడంతో గుజరాత్‌కు చెందిన కంపెనీ కాబట్టి తమ జోలికి ఎవరూ రారని మాంటెకార్లో సంస్థ ధీమాగా ఏపీలో అడుగుపెట్టింది. నెల్లూరు జిల్లాలో పనులు మొదలుపెట్టిన తర్వాత వారికి అసలు విషయం అర్థమైందని చెబుతున్నారు. కాంట్రాక్ట్‌ సంస్థది గుజరాత్‌ అయినా సరే, ఆ కంపెనీ పెద్దలు మోదీకి బంధువులైనా సరే తమ వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ బ్యాచ్ వెంటపడింది. టీడీపీ ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ఏకంగా సినిమాల్లో విలన్ల తరహాలో రెచ్చిపోయారని చెబుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఎంతగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఆయన మామూళ్ల విషయంలో వెనక్కు తగ్గలేదు. ఆ సమయంలో అడిగినంత ఇవ్వడం తప్ప మరో గత్యంతరం కూడా లేని పరిస్థితి కంపెనీకి ఎదురైందని చెబుతున్నారు.

అయితే మోదీ రాష్ట్రానికి చెందిన తమ కంపెనీనే బెదిరిస్తారా అన్న ఈగో సదరు కంపెనీకి కలిగిందని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ఆడియో టేపులు కూడా విడుదల చేశారు. గుజరాత్‌కు చెందిన కొందరు పెద్దలు ఇచ్చిన ధైర్యంతోనే సదరు కంపెనీ ఇంత ధైర్యంగా ముందుకు అడుగేసిందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కంటే చంద్రబాబుకే ఎక్కువ డ్యామేజ్ అయిందంటున్నారు. తెలుగు టీవీ ఛానళ్లు, పత్రికలు తన చెప్పు చేతుల్లో ఉండడంతో రామకృష్ణ రూ. 5కోట్ల వ్యవహారాన్ని బయటకు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఈ సంగతి చేరాల్సిన వారికి చేరిందని చెబుతున్నారు. పైగా ఇప్పటికే దేశంలోనే అవినీతిలో నెంబర్‌ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీ తాజా ఉదంతంతో పారిశ్రామికవర్గాల్లో ఉన్న పరువు కూడా పోయిందంటున్నారు. మొత్తం మీద సామంతరాజులను నియంత్రించడంలోనూ, ఎవరి నుంచి డబ్బులు వసూలు చేయాలన్న విషయం వారికి అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వడంలో చంద్రబాబు విఫలమైనట్టే ఉన్నారు. కానీ ఏం చేస్తాం. ఐదు కోట్ల వ్యవహారంలో దొరికినా సరే ఎమ్మెల్యే రామకృష్ణపై చర్యలు తీసుకోలేని సంకట స్థితి చంద్రబాబుది. ఎందుకంటే రామకృష్ణపై వేటు వేస్తే మరి ఓటుకు నోటు పెద్దల సంగతేంటి అన్న ప్రశ్న వస్తుంది కదా!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News