ఆ సమయంలో ఆయన సింధుకి కోచ్‌గా మాత్రమే మిగిలారు! " పుల్లెల గోపీచంద్ భార్య పివివి లక్ష్మి
సింధు విజయంతో తన శిక్షణకు ఎదురులేదని రుజువు చేసుకున్నారు పుల్లెల గోపీచంద్. ఆయన సతీమణి పివివి లక్ష్మి కూడా ఒకప్పుడు పేరుమోసిన షట్లరే. అందుకే ఆమె సింధు విజయం తరువాత తను ఆడిన రోజులను, ఆనాటి పరిస్థితులను తలచుకున్నారు. సింధుకి శిక్షణ ఇచ్చే సమయంలో గోపిచంద్…భార్యాపిల్లలను, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం ఒక కోచ్గా మారిపోయారని, అహరహం శ్రమించారని ఆమె అన్నారు. అత్యున్నత స్థాయి క్రీడల్లో రాణించడం లేదని మన క్రీడాకారులను నిందించడం తగదని, మనదేశం […]
సింధు విజయంతో తన శిక్షణకు ఎదురులేదని రుజువు చేసుకున్నారు పుల్లెల గోపీచంద్. ఆయన సతీమణి పివివి లక్ష్మి కూడా ఒకప్పుడు పేరుమోసిన షట్లరే. అందుకే ఆమె సింధు విజయం తరువాత తను ఆడిన రోజులను, ఆనాటి పరిస్థితులను తలచుకున్నారు. సింధుకి శిక్షణ ఇచ్చే సమయంలో గోపిచంద్…భార్యాపిల్లలను, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం ఒక కోచ్గా మారిపోయారని, అహరహం శ్రమించారని ఆమె అన్నారు.
అత్యున్నత స్థాయి క్రీడల్లో రాణించడం లేదని మన క్రీడాకారులను నిందించడం తగదని, మనదేశం క్రీడాకారులకు మౌలిక వసతుల విషయంలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని ఆమె అన్నారు. అప్పట్లో తాము క్రీడాకారులుగా ఎదుర్కొన్నకష్టాలు, అవరోధాలను తొలగించడమే ఇప్పుడు తమ అకాడమీ చేస్తున్న పని… అని లక్ష్మి చెప్పారు. అప్పట్లో రాజకీయ సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నపుడు తమకు ప్రధాన స్టేడియం అందుబాటులో ఉండేది కాదని, ఒకసారయితే అందులో ఎన్నికల బ్యాలట్ బాక్సులు ఉంచి స్టేడియంని పూర్తిగా మూసేశారని ఆమె అన్నారు.
లక్ష్మి ఇప్పుడు భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా క్రీడానిపుణురాలిగా మూడు పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అమె అనుక్షణం, అన్ని సమయాల్లో గోపీచంద్కి తోడునీడగా నిలుస్తున్నారు. లక్ష్మి 1996లో అట్లాంటా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినా కొన్ని విషయాలు మాత్రం అలాగే ఉన్నాయన్నారామె. ఆ లోపాలను సరిదిద్దడమే గోపీచంద్ అకాడమీలో జరుగుతున్నదన్నారు. తమ పిల్లలు గాయత్రి (13), సాయి విష్ణు (12)లకు గానీ, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇతర స్టూడెంట్స్‌కి గానీ…వారిలోని టాలెంట్కి ఏకాగ్రత, పట్టుదలలను జోడిస్తున్నామన్నారామె.
లక్ష్మి బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎనిమిదేళ్లు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అప్పటి పరిస్థితుల వలన తాము గొప్ప లక్ష్యాలను ఎంచుకోలేకపోయామని అన్నారామె. తాను రాజమండ్రి నుండి కెరీర్ మొదలు పెట్టినపుడు ఆంధ్ర ప్రదేశ్ నుండి నేషనల్ ఛాంపియనే లేరని లక్ష్మి తెలిపారు. నేషనల్ ఛాంపియన్లంతా మహారాష్ట్ర, కర్ణాటకలనుండే ఉండేవారని, ఇప్పుడు ఎవరూ జాతీయ స్థాయి ఆటల గురించి మాట్లాడటం లేదని అందరూ అంతర్జాతీయ స్థాయి క్రీడలపైనే దృష్టి పెడుతున్నారని లక్ష్మి పేర్కొన్నారు.
లక్ష్మి రెండుసార్లు జాతీయ ఛాంపియన్గా గెలిచారు. ఒకసారి రన్నరప్ స్థానంలో నిలిచారు. ఇంకా మలేషియా కామన్వెల్త్ గేమ్స్లోనూ, సార్క్ క్రీడలపోటీల్లోనూ, శ్రీలంకలోనూ ఆడి పతకాలు సాధించారు. పనిరాక్షసుల్లా సాధనచేసేవాళ్లమన్నారు. ఇప్పటిలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకపోవడంతో తమకు పూర్తి ఏకాగ్రత ఉండేదన్నారు. గోపీచంద్ సంవత్సరానికి నాలుగైదు నెలల పాటు జర్మనీలో ప్రాక్టీస్ చేయడం వల్లనే ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ని సాధించారని ఆమె అన్నారు.
గోపి తన జీవితాన్ని అకాడమీకి అంకితం చేశారని చెప్పవచ్చని… ఉదయం నాలుగుకి అకాడమీకి వెళితే రాత్రి ఏడుతరువాత బయటకు వస్తారని, మధ్యలో గంటా లేదా రెండు గంటలు లంచ్ బ్రేక్ మాత్రమే తీసుకుంటారని, ఆయన 100శాతం అంకిత భావంతో ఉంటారని, స్టూడెంట్స్ నుండి కూడా అంతే ఆశిస్తారని ఆమె అన్నారు. సాయంత్రం గంట మాత్రమే తాము గడిపే క్వాలిటీ టైమ్ ఉంటుందన్నారు. తన కెరీర్ పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని, కానీ గోపిలాంటి కోచ్ దొరికి ఉంటే చాలా బాగా రాణించేదాన్నని ఆమె అన్నారు. సింధు గెలుపు పట్ల గర్వంగా ఉందన్న లక్ష్మి… తమ కుమార్తె గాయత్రి కూడా మంచి క్రీడాకారిణిగా ఎదుగుతున్నదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది అండర్ 15లో ఆమె భారత్ నెంబర్ 1గా ఉందని, ఇండోనేషియా జూనియర్ ఎబిసి లో పాల్గొన్నవారిలో తమ కుమార్తే చిన్నదని, డబుల్స్ ఛాంపియన్ సాధించిందని ఆమె తెలిపారు.