తాడిపత్రిలో ఉంటే ఒక్కడే రౌడీ ఉండాలి, వైసీపీ నేత ఒక శకుని

అనంతపురంలో తాము రాజకీయం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అనంతపురం ఏమైనా ప్రభాకర్ చౌదరి సొంతమా అని ప్రశ్నించారు. వేరే ఊరి నుంచి వచ్చిన ప్రభాకర్‌ చౌదరి రాజకీయం చేయవచ్చు తాము మాత్రం చేయకూడదా అని అన్నారు. టోల్‌ గేట్ల వద్ద జేసీ వాహనాలకు సొమ్ము చెల్లించరన్న ఆరోపణలను ఆయన ఖండించారు. టోల్‌ప్లాజాల దగ్గర అడుక్కోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. ఎప్పుడైనా జేసీ చేయి పైనే ఉంటుంది గానీ ఎవరో ఇస్తే తీసుకునే రకం తాము కాదన్నారు. తమ […]

Advertisement
Update:2016-07-29 13:39 IST

అనంతపురంలో తాము రాజకీయం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అనంతపురం ఏమైనా ప్రభాకర్ చౌదరి సొంతమా అని ప్రశ్నించారు. వేరే ఊరి నుంచి వచ్చిన ప్రభాకర్‌ చౌదరి రాజకీయం చేయవచ్చు తాము మాత్రం చేయకూడదా అని అన్నారు. టోల్‌ గేట్ల వద్ద జేసీ వాహనాలకు సొమ్ము చెల్లించరన్న ఆరోపణలను ఆయన ఖండించారు. టోల్‌ప్లాజాల దగ్గర అడుక్కోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. ఎప్పుడైనా జేసీ చేయి పైనే ఉంటుంది గానీ ఎవరో ఇస్తే తీసుకునే రకం తాము కాదన్నారు. తమ పేరు చెప్పుకుని ఎవరైనా ఏదైనా చేస్తే దానికి తాము ఏం చేయగలమని ప్రశ్నించారు. హైదరాబాద్‌ వెళ్తే జేసీ చికెన్ సెంటర్, జేసీ బ్రదర్స్ దుకాణం కూడా మీవేనా అని కొందరు అడుగుతుంటారని చమత్కరించారు.

మీడియాపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. మీడియా వాళ్లు నిజాయితీగా ఉండి ఆ తర్వాత తమను ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు. టీవీ వాళ్లు, పత్రికల వాళ్లే మోస్ట్ కరెప్ట్ అని అన్నారు. నాలుగు ఏళ్ల 11 నెలల పాటు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఒక పనికిమాలిన వాడు అని రాసే మీడియా వాళ్లు ఎన్నికల సమయంలో ఓ ఐదు లక్షలు ఇస్తే చాలు.. ప్రభాకర్ రెడ్డి వీరుడు శూరుడు, అసలు ప్రభాకర్‌ రెడ్డే లేకుంటే తాడిపత్రే లేదు అంటూ రాస్తారని ఎద్దేవా చేశారు. గతంలో గల్లుకిచ్చేవాడికైనా(రాయలసీమలో ఉరిని గల్లు అంటారు) ఆఖరి కోరిక ఏంటని అడుగుతారంటూ తానంటే… కల్లుగీసేవాడా అన్నానని, గడ్డం గీసేవాడా అన్నానని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.

తాడిపత్రి అభివృద్ధికి మొదట్లో కాస్త కఠినంగానే ఉండేవాడినని చెప్పారు. రానురాను ప్రజలు కూడా ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా ఊరి మంచికే చేస్తారన్న భావనకు వచ్చి సహకరిస్తున్నారన్నారు. ఈ రోజు 1000 కోట్ల ఆస్తులున్న మున్సిపాలిటి తాడిపత్రి మాత్రమేనన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు జీతాలు ఇచ్చేందుకు కూడా కిందమీదపడుతున్నాయని, తాడిపత్రి మున్సిపాలిటికి మాత్రం రూ. 29కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మిగులు ఉందని చెప్పారు. తాడిపత్రిలో బ్రాందీ షాపు దక్కించుకుంటే మున్సిపాలిటికీ రూ. 50లక్షలు ఇవ్వాల్సిందేనన్నారు. తాడిపత్రిలో ఉంటే ఒక్కడే రౌడీ ఉండాలని ఆరౌడీ కూడా తానే అయి ఉండాలన్నారు. మంచికైనా చెడుకైనా తాను బాధ్యత వహిస్తానన్నారు. ఎవరినీ మోసం చేసి బతకాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదన్నారు. దేశంలోని అన్ని రకాల కార్లు తమ ఇంట్లో ఉన్నాయన్నారు. తాము ఎక్కడ ఎత్తుకురాలేదు కాబట్టే ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామన్నారు.

ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరుకుతోంది కాబట్టే ఫ్యాక్షన్ తగ్గిందని… ఇదేదో పోలీసుల వల్ల జరిగిన పరిణామం కాదన్నారు. తాడిపత్రిలో ఎన్నడూ కూడా ఫ్యాక్షన్ లేదన్నారు. జిల్లాకు సాగు నీరు ఇస్తే ఎలాంటి కక్షలు ఉండవన్నారు. తమ వద్దకు ఎవరైనా పని మీద వస్తే … ఆ పని సాధ్యమని అనుకుంటేనే మాట ఇస్తామన్నారు. అనవసరంగా ఆశలు రేపి తిప్పుకునే రకం తాము కాదన్నారు. తాడిపత్రి నుంచి ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న 6500 మందికి నిత్యం భోజనం వెళ్తుందని చెప్పారు. అత్యంత క్వాలిటీ ఫుడ్‌ను అందిస్తుంటామన్నారు.

పరిటాల రవి వరుసగా మూడు ఎన్నికల్లో తాడిపత్రి వచ్చారని… ఆయన వచ్చిన ప్రతిసారీ తమకు మరింత మెజారిటీ పెరిగిందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి టీడీపీలోకి రావాల్సిందిగా కోరారని… కాబట్టి పరిటాల సునీత వ్యతిరేకిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.

మంత్రి పదవులపై తనకు ఇష్టం లేదన్నారు. తాను చనిపోతే తాడిపత్రి జనం ఒక నాలుగు రోజులు గుర్తు పెట్టుకుంటే చాలని అంతకు మించి తనకు ఏమీ అక్కర్లేదన్నారు. రోడ్ల వెడల్పు కారణంగా ఇళ్లు కోల్పోయిన వారు తనను ”జేసీపీ” అంటారని… మిగిలిన వారు మాత్రం జేసీపీఆర్ అంటారని చెప్పారు.

మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి ఒక శకునిలాంటి వాడని అన్నారు. వెంకట్రామిరెడ్డిని తన అన్న దివాకర్‌ రెడ్డి సొంత వ్యక్తిలాగా భావించారని కానీ అతడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి అని ప్రకటించగానే తన అన్న గెలుపు ఖాయమని చెప్పానన్నారు. వెంకట్రామిరెడ్డి గురించి జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వెంకట్రామిరెడ్డిని బరిలో దింపడం వల్ల తన అన్న గెలుపు మరింత ఈజీ అయిందన్నారు. రఘువీరారెడ్డి కర్నాటక నుంచి రాజ్యసభ సీటు వస్తుందన్న ఆశతోనే కాంగ్రెస్‌లో ఉన్నారని అది రాకుంటే ఆయన కూడా వైసీపీలోకి లేదంటే బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రఘువీరారెడ్డి ఇలాంటి రాజకీయాలే చేస్తే ప్రజలు ఏదో ఒక రోజు తంతారని హెచ్చరించారు. తమ పిల్లలైనా మరెవరైనా 75శాతం ప్రజల కోసం, 25 శాతం సొంత పనులకోసం కేటాయించుకుంటేనే రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందన్నారు.

తాము ఒక కార్యక్రమం నిర్వహిస్తే లక్షా 5వేల మందివచ్చారని .. తమ కార్యకర్తలు ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. ఈవెంట్ మేనేజర్లే తమ కార్యకర్తల కమిట్‌మెంట్ చూసి ఆశ్చర్యపోయారన్నారు. అలాంటి కార్యకర్తలు తమకు తప్పా మరే నాయకుడికి లేరన్నారు. అందుకు గర్వంగా ఉందన్నారు. ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు ఇచ్చినా మిగిలిన సొమ్మును తిరిగి ఇవ్వడం వంటి గొప్ప వ్యక్తిత్వం తన అనుచరుల వద్దే ఉందన్నారు. ఏదైనా తమ భుజాల మీద వేసుకుని పనిచేస్తారని వారికి తాను హ్యాట్సప్ చెప్పకుండా ఉండలేనన్నారు.

ఇప్పటికీ తన అన్న తాను కలిసే ఉంటామని. ఏ విషయంలోనైనా అన్న దివాకర్‌ రెడ్డి మాటే ఫైనల్ అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇంటితో పాటు స్థానిక అంశాల్లో తాను చెప్పిన దానికే దివాకర్‌ రెడ్డి ఓకే చెబుతుంటారని అన్నారు. తన అన్న ఊరిలో ఉంటే తన కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తామని కలిసే భోజనం చేస్తుంటామన్నారు. 1943లోనే తన తండ్రి బొగ్గుతో నడిచే బస్సులను నడిపారని చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి స్వాతంత్య్ర ఉద్యమంలో జైలుకు వెళ్లాడని చెప్పారు. గుర్రపు స్వారీ వచ్చన్నారు. స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేవాడినన్నారు. 1952 నుంచి తాడిపత్రిలో తమ కుటుంబం ఓడిపోలేదన్నారు. అంతటి అవకాశం ఇచ్చిన తాడిపత్రి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. తాడిపత్రి తన దృష్టిలో ఒక కుటుంబమని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News