వాయు కాలుష్యంతో కళ్లకు ముప్పు!
నగరాలు, పట్టణాల్లో మితిమీరుతున్న వాయుకాలుష్యం మన ఆరోగ్యాల మీద విపరీత పరిణామం చూపుతోందన్నది ఇప్పటికే రుజువైన నిజం. ఈ కాలుష్యం కంటి జబ్బులను సైతం తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లకలక, కళ్ల ఎలర్జీలకు ప్రధాన కారణం కాలుష్యమేనని వారు చెబుతున్నారు. వీటికి సరైన చికిత్స అందించలేకపోతే కార్నియా సమస్యలు వస్తాయని కాబట్టి కంటి ఆరోగ్యం విషయంలో కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాలని ఈ వైద్యులు అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గత ఏడాది, వాయుకాలుష్యం, గాలిలో దుమ్ము కణాలు పెరిగిపోవడం వలన […]
నగరాలు, పట్టణాల్లో మితిమీరుతున్న వాయుకాలుష్యం మన ఆరోగ్యాల మీద విపరీత పరిణామం చూపుతోందన్నది ఇప్పటికే రుజువైన నిజం. ఈ కాలుష్యం కంటి జబ్బులను సైతం తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లకలక, కళ్ల ఎలర్జీలకు ప్రధాన కారణం కాలుష్యమేనని వారు చెబుతున్నారు. వీటికి సరైన చికిత్స అందించలేకపోతే కార్నియా సమస్యలు వస్తాయని కాబట్టి కంటి ఆరోగ్యం విషయంలో కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాలని ఈ వైద్యులు అంటున్నారు.
ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గత ఏడాది, వాయుకాలుష్యం, గాలిలో దుమ్ము కణాలు పెరిగిపోవడం వలన 30వేల మంది కార్నియా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యారు. చిన్నపిల్లలనుండి సీనియర్ సిటిజన్ల వరకు కాలుష్యం కారణంగా కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, కళ్లు ఇరుకున పడటం లాంటి సమస్యలకు గురవుతున్నారని న్యూఢిల్లీలోని ఓ ప్రయివేటు కంటిచికిత్సా కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులొకరు పేర్కొన్నారు. మొక్కలనుండి వెలువడే పుప్పొడులు, పరిశ్రమలు, వాహనాల ద్వారా వెలువడే రసాయనాలు కళ్ల కలకను కలిగిస్తాయని ఆ వైద్యుడు తెలిపారు.
నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్యాల కారణంగా మన కన్నీటిలో ఆమ్లతత్వం పెరగటం గమనించినట్టుగా కంటివైద్యులు వివరించారు. సాధారణంగా మన కన్నీళ్లలో నీళ్లు, ఫ్యాటీ ఆయిల్, ప్రొటీన్లు, బ్యాక్టీరియాపై పోరాడే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కంటిని తడిగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. కంటికి ఇంతగా అనారోగ్యాలు పొంచి ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు కంటి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.
-కళ్లలో చిన్నపాటి నలకలు పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ నలపకూడదు. కళ్లను మంచినీళ్లతో కడగాలి.
-కంటిపై తడిబట్ట వేసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారా కంటి వాపుని తగ్గించవచ్చు.
-ఎలర్జీకి కారణమయ్యేవి గాలిద్వారా నేరుగా కంటిని తాకడం వలన ఎలర్జీలు వస్తాయి. పొడిగాలుల్లో ఇవి మరింతగా పెరుగుతాయి. ఒకసారి ఎలర్జీ వస్తే తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. కంటి ఎలర్జీలను అశ్రద్ధ చేయకుండా చికత్స తీసుకోవాలి.