రేవంత్ బెయిల్‌పై తీర్పు 30కి వాయిదా
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌పై తీర్పును ఈనెల 30కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సుమారు గంట సేపు కొనసాగిన వాదనలు హాట్‌హాట్‌గా జరిగాయి. బెయిల్ ఇచ్చినా విచారణకు పూర్తిగా సహకరిస్తామని రేవంత్ న్యాయవాది కోర్టుకు తెలపగా, బెయిల్ మంజూరు చేస్తే విచారణకు చాలా ఇబ్బంది అవుతుందని, దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, కేసు ముందుకు సాగదని తెలంగాణ ఏసీబీ అడ్వకేట్ వాదించారు. రాజకీయ కుట్రతోనే రేవంత్‌ను కేసులో ఇరికించారని న్యాయవాది చెప్పగా, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించడానికి […]
Advertisement
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌పై తీర్పును ఈనెల 30కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సుమారు గంట సేపు కొనసాగిన వాదనలు హాట్‌హాట్‌గా జరిగాయి. బెయిల్ ఇచ్చినా విచారణకు పూర్తిగా సహకరిస్తామని రేవంత్ న్యాయవాది కోర్టుకు తెలపగా, బెయిల్ మంజూరు చేస్తే విచారణకు చాలా ఇబ్బంది అవుతుందని, దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, కేసు ముందుకు సాగదని తెలంగాణ ఏసీబీ అడ్వకేట్ వాదించారు. రాజకీయ కుట్రతోనే రేవంత్‌ను కేసులో ఇరికించారని న్యాయవాది చెప్పగా, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నించడం వల్లే ఆయనపై కేసుపై నమోదు చేయాల్సి వచ్చిందని ఏ.జి. వాదించారు. రేవంత్ ఒక ఎమ్మెల్యేను రెండు కోట్ల రూపాయలకు కొనాలని ప్రయత్నించారని, అడ్వాన్స్‌గా 50 లక్షలు చెల్లించారని, ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తేలాల్సి ఉందని ఏ.జి. కోర్టుకు తెలియజేశారు. అలాగే ఫోన్ సంభాషణలకు సంబంధించి కాల్ డేటా పరిశీలించాల్సి ఉందని, రెండు రోజుల క్రితం కీలక సమాచారం తమకు లభించిందని, దాని ఆధారంగా మరోసారి రేవంత్‌ను విచారించాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రేవంత్ బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో రేవంత్ పట్టుబడ్డారని, ఇపుడు బయటికి వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పదిమంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వమే పడిపోయి పరిస్థితి కలిగేదని, ఇది తీవ్ర నేరంతో కూడిన కేసు అయినందున బెయిల్ మంజూరు చేయవద్దని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే రేవంత్ తరఫు న్యాయవాది తన వాదనలో ఇప్పటికే ఏసీబీ అధికారులు నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్నారని, ఇంక ఆయన నుంచి రాబట్టడానికి అదనపు సమాచారం ఏమీ లేదని చెప్పారు. అసలు ఎన్ని సీట్లకు ఎంత మంది పోటీ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా ఆరు సీట్లకు ఏడుగురు పోటీ చేశారని, నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 15 మందేనని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే తప్ప గెలిచే పరిస్థితి లేనప్పటికీ పోటీకి దించడం గమనించాల్సిన విషయమని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఓటుకు నోటు కేసు ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పును 30వ తేదీన వెలువరిస్తానని చెప్పి కేసును వాయిదా వేశారు.
Advertisement