సగటు వైఎస్‌ అభిమానులకూ మింగుడుపడని నైజం

సొంత రాష్ట్రంలోనైనా జగన్‌ ఎన్నో ఎదురుదెబ్బలు తింటే గానీ అధికారం అందలేదు. అసలు షర్మిల తాను తెలంగాణ కోడలు అని చెప్పుకుంటోందే గానీ.. మొన్నటి ఎన్నికల్లోనూ ఆమె పులివెందుల ఓటరే.

Advertisement
Update:2022-12-01 17:18 IST

వైఎస్‌ లాంటి నాయకుడి ముందు ఆయన కుటుంబంలోని మిగిలిన వారి ప్రభావం పెద్దగా బయట కనిపించలేదు. ఆయన ఉన్నంత కాలం వైఎస్‌ కుటుంబంలో విబేధాలు అన్న మాటే అసాధ్యం అన్నట్టుగా ఉండేది. చిన్నచిన్న తేడాలున్నా అవి ఆయన్ను దాటి బయటకు వచ్చి బజారులో నిలబడలేదు.

వైఎస్‌ మరణం తర్వాత పరిస్థితి మారుతూ వస్తోంది. తొలిరోజుల్లో కుటుంబం మొత్తం సమష్టిగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఏపీలో నిలవడమే అందరి కర్తవ్యం అన్నట్టుగా కుటుంబం నడిచింది. అన్నకోసం షర్మిల పాదయాత్ర చేసింది. కుమారుడి కోసం విజయమ్మ ఊరూరా తిరిగారు. జగన్ సీఎం అయిన తర్వాత వారి తీరు మారింది. వైఎస్‌ కుటుంబంలో విబేధాలు అనే మాట చాలా చిన్నదైపోయింది.

ఎవరి మాట ఎవరూ వినని కుటుంబంగా వైఎస్‌ కుటుంబానికి వారసులు పేరు తెచ్చిపెట్టారు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తన బాధ్యతల పరిధి ఎరిగి పనిచేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టకుండా ఏపీ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయన వల్ల వైఎస్‌ పేరుప్రతిష్టలకు పెద్దగా నష్టం జరగలేదు. వైఎస్ కుమార్తె షర్మిల, ఆమెను సమర్థించే ప్రయత్నంలో సొంత కుమారుడిని కూడా '' ఆ రాష్ట్రంతో, ఆ జగన్‌తో మనకెందుకు?'' అంటూ మీడియా ముందే మాట్లాడుతూ విజయమ్మ ఒక విధంగా తమ కుటుంబం తల్లి, చెల్లి, కుమారుడు అన్న తేడా లేకుండా నిట్టనిలువుగా చీలిపోయిందని ఆమోదముద్ర వేశారు.

షర్మిల వెనుక జగన్‌ ఉన్నారు. వీరిద్దరి వెనుక బీజేపీ ఉందని తెలంగాణలో ఇతర పార్టీలవారు చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా.. వైఎస్ లాంటి మహనీయుడిని చూసిన ప్రజలు ఆయన కుమార్తె నోటి నుంచి వస్తున్న భాషను, ఉనికి కోసమే డ్రామాలు అన్నట్టుగా వ్యవహరించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సగటు వైఎస్ అభిమానులకూ రుచించడం లేదు. షర్మిల తిరుగుతున్నారేగానీ ఆమెకు ఏమాత్రం ఎక్కడా ఆద‌రణ కనిపించడం లేదన్నది ఆమె పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యే సభ్యుల సంఖ్యను చూసినా అర్థమవుతుంది. ఇప్పుడున్న నాయకుల్లో అత్యంత తక్కువగా మీడియాలో ప్రేక్షకుల ఆదరణ ఉన్న నాయకురాలిగా షర్మిల అట్టడుగు స్థానంలో ఉంటున్నారు. వేల కిలోమీటర్లు భారీగా ఖర్చు చేస్తూ తిరుగుతున్నా మైలేజ్ రాకపోవడంతోనే ఆమె ఏకంగా కేసీఆర్‌ లాంటి నాయకులనూ.. మీకు మగతనం లేదా అంటూ మహిళ నోట రాకూడని మాటలు మాట్లాడుతున్నారన్న విమర్శ ఉంది.

షర్మిల మతపరంగా చూసినా ఆమె బీజేపీకి వ్యతిరేకంగానే ఉండాలి. కానీ, ఆమె తెలంగాణలో బీజేపీకి ఉడతభక్తిగా సాయం చేస్తున్నట్టే కనిపిస్తుంది. బీజేపీకి పడే అవకాశమే లేని మైనార్టీ వర్గాల ఓట్లను పదుల సంఖ్యలోనైనా చీల్చి బీజేపీకి మంచి చేయాలన్నట్టుగానే ఆమె తీరు ఉందన్న విమర్శ ఉంది. పైగా నడిరోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేస్తే.. బీజేపీ నేతల నుంచి గవర్నర్ వరకు స్పందించారు. 2009లో వైఎస్‌ మరణించారు. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చేశాయి. వైఎస్‌పై తెలంగాణ ప్రజల్లోనూ గౌరవం ఉండొచ్చు. కానీ అది ఆయన బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించే స్థాయిలో ఇప్పుడు లేదన్నది షర్మిల వెంట నడుస్తున్న వారికీ తెలుసు.

సొంత రాష్ట్రంలోనైనా జగన్‌ ఎన్నో ఎదురుదెబ్బలు తింటే గానీ అధికారం అందలేదు. అసలు షర్మిల తాను తెలంగాణ కోడలు అని చెప్పుకుంటోందే గానీ.. మొన్నటి ఎన్నికల్లోనూ ఆమె పులివెందుల ఓటరే. పైగా ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ''కడప ఎంపీగా షర్మిలకు టికెట్‌ ఇవ్వాల్సిందిగా నేను జగన్‌ను సూచించా.. జగన్‌ కూడా సరే అన్నాడు. ఒకవేళ జగన్‌ అడిగితే కడప ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అని చెప్పు'' అని తనకు వివేకానందరెడ్డి సూచించారని.. తన బాబాయ్‌ ప్రతిపాదనకు తాను కూడా అంగీకరించానని షర్మిల సీబీఐతో చెప్పారు. అంటే వివేకా హత్య జరగకుండా, అన్ని అనుకున్నట్టుగానే జరిగి ఉంటే మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిల పోటీ చేసేవారన్నది ఆమె మాటలను బట్టే అర్థ‌మవుతోంది.

పైగా గతంలో ఆమె పూర్తి సీమాంధ్ర స్టాండ్‌ తీసుకుని మాట్లాడిన అనేక అంశాలున్నాయి. అలాంటి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమే ఒక న్యూసెన్స్. అందుకు అన్ని తెలిసిన విజయమ్మ కూడా వంత పాడడం ఆశ్చర్యం. వీరి తీరు చూశాక వైఎస్ కుటుంబ సభ్యులు దురాశ పరులు అన్న భావన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. అబ్బాయికి ఒక రాష్ట్రం సీఎం పదవిని అప్పగిస్తే.. అబ్బాయికి ఇస్తే సరిపోతుందా అమ్మాయికి కూడా సీఎం పదవి ఇవ్వాల్సిందే.. ఈ రాష్ట్రాల్లో తాము మాత్రమే నాయకులం అన్నట్టుగా వైఎస్ కుటుంబ సభ్యులు తీరుందున్న విమర్శకు వైఎస్ వారసులు ఛాన్స్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News