ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తా.. తప్పేమిటి?
ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదన్న సీఎం రేవంత్ రెడ్డి;
గతంలో చేపట్టిన ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని సీఎల్పీలో కార్యాలయంలో మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు. ఏదేనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి అన్నారు. ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటే గౌరవం ఉన్నదన్న సీఎం ఆయన బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తాను వర్గీకరణ చేస్తే మాదిగలకు అన్యాయం ఎలా జరిగిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా సీఎం ఫైర్ అయ్యారు. గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకే మెట్రో సహా ఇతర ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పట్టణాభివృద్ఙిపై కేంద్ర మంత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షకు ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇస్తున్నామని కేంద్రం చెప్పడం అబద్ధం అన్నారు. రాష్ట్రానికి 30 శాతమే వస్తున్నాయన్నారు. పదే పదే ఢిల్లీ వెళ్తున్నారంటూ కేటీఆర్ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్‌ఎస్ చూస్తున్నదని ఆరోపించారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్ర నిధులు ఇవ్వకుంటే అవసరమైతే ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 39 సార్లు కాదు 99 సార్లు అయినా వెళ్తానని తప్పేమిటని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధులపై చర్చకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. నేను, భట్టి విక్రమార్క రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి సీఎం స్థాయి సరిపోదా? పీసీసీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను బండకేసీ కొట్టే అధికారంలోకి వచ్చామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో ప్రాజెక్టులు కట్టి ఉంటే.. ఇప్పుడు ఏపీతో సమస్య వచ్చేది కాదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కేటీఆర్, కిషన్‌రెడ్డి కలిసి తిరుగుతున్నారని నేను చెబుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.