ఆఫీసుకెళ్లి మరీ తమ్మినేనిని తిట్టిన షర్మిల.. షాక్ అయిన కమ్యూనిస్టు నేత

అసలు కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో తమ్మినేని ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Advertisement
Update:2023-04-04 18:20 IST

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ ఎంత ఉందో తెలియదు గానీ.. ఇటీవల ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారాన్ని గట్టిగా పట్టుకున్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలను కూడగట్టి ఉద్యమం చేయాలని యోచిస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు అది వేరే విషయం.

ఇదిలా ఉంటే.. ఈ ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు ఆమె ఇవాళ .. సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో సమావేశమయ్యారు. మద్దతును కోరారు. అనంతరం ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎంపై విమర్శలు గుప్పించడం గమనార్హం. తమను సీపీఎం నేతలు బీజేపీ-బీ టీమ్ అంటూ విమర్శించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. తాము తెలంగాణ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అసలు కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో తమ్మినేని ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల కనీస మర్యాదను పాటించలేదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీతో చర్చించేందుకు వచ్చి.. అక్కడే విమర్శలు చేయడం ఏం సంస్కృతి అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ విధానాలు, సిద్ధాంతాల్లో భాగంగా తాము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని.. మతతత్వ పార్టీలను ఎదుర్కోవడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కాగా షర్మిల మద్దతు కోసం వెళ్లి.. అక్కడే సదరు పార్టీపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అయ్యింది.

Tags:    
Advertisement

Similar News