విలీనానికి డెడ్ లైన్.. షర్మిల బెదిరింపులకు కాంగ్రెస్ భయపడుతుందా..?

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్ లో విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని నేతలకు ఉద్భోదించారు షర్మిల. రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో YSRTP పోటి చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారామె.

Advertisement
Update:2023-09-26 13:34 IST

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమే కానీ, ఎప్పుడు, ఎలా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఒకటి రెండుసార్లు షర్మిల ఢిల్లీ వెళ్లొచ్చినా.. సోనియా, రాహుల్ తో ఫొటోలు దిగడం మినహా స్పష్టమైన ప్రకటనలేవీ చేయలేకపోయారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా అంతా హైకమాండ్ చూసుకుంటుందని అంటున్నారు కానీ అసలు విషయం చెప్పడంలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ విలీనం ఇష్టం లేదనే ప్రచారం కూడా ఉంది. షర్మిల అడుగుతున్న పాలేరు సీటుకి తుమ్మల పోటీ ఉన్నారు. రేణుకా చౌదరి వంటి సీనియర్ నేతలు కూడా షర్మిల విషయంలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఈ దశలో అసలు షర్మిల కాంగ్రెస్ లోకి వస్తారా, వచ్చి తన ఐడెంటిటీ నిలబెట్టుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఈ దశలో వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగడం సంచలనంగా మారింది.

కాంగ్రెస్ లో విలీనం వార్తలొచ్చాక షర్మిల పెద్దగా బయటకు రాలేదు. గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. పార్టీ నాయకులతో మీటింగ్ లు కూడా పెట్టడంలేదు. కానీ ట్విట్టర్లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు షర్మిల. ఉన్నట్టుండి ఇప్పుడు వైఎస్సార్టీపీ మీటింగ్ పెట్టే సరికి ఒక్కసారిగా కలకలం రేగింది. మీటింగ్ లో విలీనంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

పొత్తు లేకపోతే 119 స్థానాల్లో పోటీ..

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని నేతలకు ఉద్భోదించారు షర్మిల. రాబోయే ఎన్నికల్లో 119 నియోజక వర్గాల్లో YSRTP పోటి చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారామె. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ని బెదిరిస్తున్నారా..?

ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, మరోవైపు పార్టీ టికెట్ల వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ దశలో వైఎస్సార్టీపీ విలీనం వెనక్కు వెళ్లిపోయింది. తమతో సంప్రదింపులు జరపకుండా, తమ పార్టీ నాయకుల్ని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే అప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి..? అందుకే ఆమె హడావిడిగా ఈ మీటింగ్ పెట్టారని, 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందని సంకేతాలివ్వడం.. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచడానికేనని అంటున్నారు. విలీనంపై కాంగ్రెస్ తేల్చకపోతే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు షర్మిల. ఈ మీటింగ్ పై, షర్మిల వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News