మట్టి వాసనలు వెలుగులోకి.. కేసీఆర్ ప్రశంస

ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు. వైవిధ్యభరిత కథలతో ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Advertisement
Update:2023-03-13 13:17 IST

“తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, 'నాటు నాటు' పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన గీత రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ కి ప్రత్యేక అభినందనలు” అంటూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పై స్పందించారు సీఎం కేసీఆర్.


ఆస్కార్ అవార్డు పొందిన 'నాటు నాటు' పాటలో పొందుపరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని అన్నారు కేసీఆర్. ‘నాటు నాటు..’కు ఆస్కార్‌ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు. వైవిధ్యభరిత కథలతో ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఆర్ఆర్ఆర్ టీమ్ కు జగన్ అభినందనలు..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్‌ రావడంపై ఏపీ సీఎం జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం గర్వంగా ఉందన్నారు. తనతో సహా కోట్లాది తెలుగు ప్రజలు, భారతీయులు గర్వపడేలా చేశారని జగన్‌ కొనియాడారు.


చంద్రబాబు స్పందన..

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ పోటీలో తెలుగువారు ప్రపంచానికి టార్చ్ బేరర్‌ లా నిలవటం గర్వకారణమని అన్నారు. 95ఏళ్ల ఆస్కార్ చరిత్ర లో ‘నాటు నాటు’ పాట చరిత్ర సృష్టించి తెలుగునేలను పులకింపజేసిందని కొనియాడారు. ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా కలిసి ఓ చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు.



Tags:    
Advertisement

Similar News