హైదరాబాద్‌లో క్షేమంగా రోడ్లు దాటొచ్చు.. పెలికాన్ సిగ్నల్స్ ప్రారంభం
నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఈ సిగ్నల్స్ వద్ద ఉండే బట్ నొక్కితే 15 సెకన్ల పాటు ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో పాదచారులు క్షేమంగా రోడ్డు దాటవచ్చు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు దాటాలంటే పెద్ద ప్రహాసనమే అని చెప్పుకోవాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నా.. వాటిని ఉపయోగించే వారు చాలా తక్కువ. కొన్ని రద్దీ ప్రదేశాల్లో ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం సాధ్యపడలేదు. అయితే, బిజీ ట్రాఫిక్‌లో రోడ్లు దాటుతూ పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్లడంతో.. ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీసులు కలిసి నగరంలోని పలు చోట్ల పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు.
ఏంటీ పెలికాన్ సిగ్నల్స్?
నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఈ సిగ్నల్స్ వద్ద ఉండే బట్ నొక్కితే 15 సెకన్ల పాటు ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో పాదచారులు క్షేమంగా రోడ్డు దాటవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్లు బటన్ నొక్కుండా.. ప్రతీ సిగ్నల్ వద్ద ఒక వలంటీర్‌ను నియమించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సిటీ పోలీసులు నగరమంతా అధ్యయనం చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు.
పెలికాన్ సిగ్నల్ పడితే వాహనాలు తప్పకుండా ఆగాల్సి ఉంటుంది. లేకపోతే సీసీ కెమేరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వాహనదారులపై చర్యలు తీసుకుంటారు. పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఉండే వలంటీర్లకు పాదచారులు సహకరించాలని కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. రాబోయే రోజుల్లో సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ట్యాంక్ బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు సీవీ ఆనంద్ బాడీ కెమేరాలను అందజేశారు. వాహనదారులతో మాట్లాడే సమయంలో, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాలను ఈ కెమేరాల ద్వారా గుర్తిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. బాడీ కెమేరాల్లో రికార్డయ్యే ప్రతీ అంశం ట్రాఫిక్ కంట్రోల్ రూంలోని కంప్యూటర్లలో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఇక ఎండలు మండిపోతున్న క్రమంలో.. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న పోలీసులకు వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, కూలింగ్ గ్లాసెస్ అందించారు. వర్షాకాలంలో ఉపయోగించేందుకు వీలుగా రెయిన్ కోట్లు, బూట్లు కూడా పంపిణీ చేశారు.