కులగణను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారు
ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
బీసీ కులగణనపై ప్రతిపక్షాలు, బీసీ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో వాటి నివృత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. కులగణన జరిగిన తీరుపై సమావేశంలో రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి సందేహాలపై సీఎం వివరించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. రాహుల్‌గాంధీ మాట ఇచ్చిన తర్వాత ప్రజలకు మనకు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టాం. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే .. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగి తీరుతుంది.
అధికారిక కార్యాచరణకు అధికార బృందాన్ని వేశామన్నారు. బీహార్, కర్ణాటక వివిధ రాష్ట్రాల అధికారుల బృందాన్ని నిర్వహించాం. కులగణనలో మూడు రోజులు ఇండ్ల వివరాలు సేకరించామన్నారు. దీనికి ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించాం. మొత్తం 8 పేజీలలో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించాం. దీనికోసం 36 వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని ఎన్‌రోలర్‌గా సమాచారం సేకరించని వారే డేటా ఎంట్రీ చేశారు. సుమారు కోటి 12 లక్షలకు పైగా కుటుంబాలు కులగణనలో పాల్గొన్నాయని సీఎం తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన ప్రయత్నమే చేయలేదు. కులగణనను న్యాయపరంగా, చట్టపరంగా చేశాం. 96.9 శాతం జరిగింది. 3.1 శాతం కులగణన సర్వే రాలేదన్నారు.
ఇంత పారదర్శకంగా కులగణన చేపడుతున్నా కొంతమంది నాయకులు ఇంకా చేయించుకోలేద. కేసీఆర్ చేసిన సమగ్రకుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 5 కేటగిరీలు ఉన్నాయి. ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదు. గుజరాత్‌నూ ఓబీసీ ముస్లిలు ఉన్నారని ప్రధాని మోడీ చెప్పారు. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్‌ఎస్ భయపడుతున్నది. చరిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
కులగణను కాపాడుకోకపోతే.. బీసీలే నష్టపోతారు. కులగణనను ఇంతకంటే పకడ్బందీగా చేసే రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదు. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వండి. బీసీల కోసం చేపట్టాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యాచరణపై సూచనలు ఇవ్వండి. బీసీల జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. రెండో విడత పూర్తికాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తాం. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చాం. కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించండి. అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించడంతో నా బాధ్యత నెరవేరుతుంది అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఏం కోరుకుంటున్నారో బీసీలే చెప్పాలన్నారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి. మీరు లెక్కపెట్టకుండానే నా లెక్క తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు. జనగణనలో కులగణన చేసి.. నా లెక్క తప్పని నిరూపించాలి. అన్ని సామాజికవర్గాలు ఎవరికి వారు తీర్మానాలు చేయండి. మార్చి 10 లోపు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి సమర్పించండి. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను మీరు స్వాగతించకుండా మీరు ఏదో ఆశిస్తే అది జరగదని సీఎం స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌తోనే సామాజికన్యాయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని, కులగణన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 8 కోట్ల పేజీలకు పైగా సమాచారం సేకరించామన్నారు. పాదర్శకంగా కులగణన చేశామని చెప్పారు. 2011 జనాభా లెక్కల సమయంలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు తేల్చారు. కేసీఆర్ చేపట్టిన సర్వే అధికారికం కాదని, దానిని కేబినెట్‌లో పెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీ సర్వే విజయవంతమైతే దేశవ్యాప్తంగా చేయాలని ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, అందుకే సర్వే బాగాలేదని బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నదన్నారు.