వర్కింగ్ ఇన్ నేచర్.. హైదరాబాద్ లో సరికొత్త అనుభవం
ఈ థీమ్ పార్క్ లో పిల్లలు ఆడుకోడానికి ప్లే ఏరియా ఉంటుంది. చెట్ల మధ్యలో ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేసుకోడానికి వీలుగా కొన్ని టేబుల్స్ ఉంటాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ మొదలైంది. త్వరలో పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తప్పనిసరి కాబోతోంది. మరి మధ్యలో ఈ వర్క్ ఇన్ నేచర్ ఏంటని అనుకుంటున్నారా..? హైదరాబాద్ వాసులకు తెలంగాణ మున్సిపల్ శాఖ అందిస్తున్న వరం. ఎంచక్కా నేచర్ లో కూర్చుని పనిచేసుకునే సరికొత్త అనుభూతిని అందించబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
నేచర్ తో వర్క్ ఎలా..?
ఏసీ రూమ్ లు, ఎల్ఈడీ లైట్లు, రూమ్ స్ప్రే లతో ఆర్టిఫిషియల్ సువాసనల మధ్య పనిచేయడం అలవాటైన టెకీలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ తో మరో కొత్త అనుభూతిని నేర్చుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రకృతి మధ్య కూర్చుని పనిచేయడం అనే మరో సరికొత్త అనుభవాన్ని వారికి అందుబాటులోకి తెస్తోంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో 50 థీమ్ పార్క్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇటీవలే వీటి గురించి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ థీమ్ పార్క్స్ లో కొన్ని టెకీలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇవ్వబోతున్నాయి.
ఈ థీమ్ పార్క్ లో పిల్లలు ఆడుకోడానికి ప్లే ఏరియా ఉంటుంది. చెట్ల మధ్యలో ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేసుకోడానికి వీలుగా కొన్ని టేబుల్స్ ఉంటాయి. వీటికి చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ల్యాప్ టాప్ తోపాటు ఈ పార్క్ కి వస్తే ఎంచక్కా పిల్లలు ఆడుకునేలోపు మన పని పూర్తి చేసుకోవచ్చు. సరదాగా కాసేపు పిల్లలతో కూడా ఆడుకోవచ్చు. పిల్లలతో కలసి పార్క్ కి రావడం టైమ్ వేస్ట్ అనుకునే పెద్దలకు ఇది అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. ఈ థీమ్ పార్క్ లో ఉన్న నమూనా టేబుల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి 50 థీమ్ పార్క్ లు త్వరలో హైదరాబాద్ నగరం మొత్తం అందుబాటులోకి వస్తాయి.