లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా సీఎం కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో తమ వంతు కర్తవ్యం నిర్వర్తించి ఈ బిల్లు త్వరగా సాకారం అయ్యేలా చేసినందుకు చాలా గౌరవంగా ఉన్నదని పేర్కొన్నారు.
నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టిన వెంటనే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లునే ముందుగా ప్రవేశపెట్టింది. దీనిపై రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పందనే వస్తున్నది. కొన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు సూచనలు కూడా చేస్తున్నాయి. రేపటి నుంచి ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.
కొన్ని సమయాల్లో రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలి. దేశం యొక్క విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఈ రోజు మార్గం సుగమమం అయినందుకు ఒక భారతీయ పౌరుడిగా ఎంతో గర్విస్తున్నాను. ఈ బిల్లు రూపొందించడంలో బాధ్యలైన వారందరినీ నా హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికే కాకుండా.. మద్దతు ఇస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అని మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా సీఎం కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో తమ కర్తవ్యం వంతు నిర్వర్తించి ఈ బిల్లు త్వరగా సాకారం అయ్యేలా చేసినందుకు చాలా గౌరవంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచే 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు అమలు చేస్తున్నాము. జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల వంటి స్థానిక సంస్థల్లో ఈ మేరకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.