సిలిండర్ల‌తో హడలెత్తిస్తున్న మునుగోడు మహిళలు..

గ్యాస్ సిలిండర్ రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, వాటిని అందుకోలేకపోతున్నామంటూ సింబాలిక్ గా ఉట్టికి గ్యాస్ సిలిండర్ నమూనాను కట్టేశారు. ఉట్టి కొడుతున్నట్టుగా మహిళలు తమదైన శైలిలో వెరైటీ నిరసన చేపట్టారు.

Advertisement
Update:2022-10-28 12:11 IST

మునుగోడులో ప్రచారం రోజుకో కొత్తపుంత తొక్కుతోంది. ఆమధ్య దీపావళి సందర్భంగా నరకాసుర సంహారంతోపాటు, ఫ్లోరైడ్ భూతానికి కూడా నిప్పుపెట్టారు మునుగోడు వాసులు. తాజాగా మునుగోడు మహిళలు గ్యాస్ సిలిండర్ల నమూనాలతో చేసిన విన్యాసాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డులతో మునుగోడులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గతంలో ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయి అంటూ రేట్లు ప్రింట్ చేసి మరీ మోదీ పాలనను ఎండగట్టారు.

గ్యాస్ బండతో ఉట్టి..

ఇదంతా ఒక ఎత్తు అయితే, గ్యాస్ సిలిండర్ ని ఉట్టిలాగా కట్టి దాన్ని కొట్టేందుకు మహిళలు ప్రయత్నించడం మరో ఎత్తు. గ్యాస్ సిలిండర్ రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, వాటిని అందుకోలేకపోతున్నామంటూ సింబాలిక్ గా ఇలా ఉట్టికి గ్యాస్ సిలిండర్ నమూనాను కట్టేశారు. ఉట్టి కొడుతున్నట్టుగా మహిళలు తమదైన శైలిలో వెరైటీ నిరసన చేపట్టారు.

మోదీ హయాంలో అది ఇది అనే వివక్ష లేకుండా అన్ని రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఎనిమిదేళ్లలో నిత్యావసరాల రేట్లు 300 శాతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గతంలో ఏయే వస్తువుల రేట్లు రూపాయిల్లో పెరిగితే మోదీ టీమ్ కిందామీదా పడిపోయి రోడ్లపైకొచ్చి నిరసన తెలిపిందో, ఇప్పుడు అవే వస్తువుల రేట్లు వందల్లో పెరిగినా వారంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉంటున్నారు. తప్పంతా కరోనాపై నెట్టేసి కాలక్షేపం చేస్తున్నారు. రూపాయు పతనాన్ని కూడా డాలర్ తో ముడిపెట్టి కవర్ చేసుకుంటున్నారు. ఈ దశలో మునుగోడు ఉప ఎన్నికపై ఈ ప్రభావం కచ్చితంగా కనపడే అవకాశముంది. మునుగోడు మహిళలు గ్యాస్ సిలిండర్ ని తెరపైకి తేవడం ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డికి గ్యాస్ బండ పెద్ద అడ్డంకిగా మారింది.

Tags:    
Advertisement

Similar News