నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా

సినీ కుటుంబంలోని వ్యక్తులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ఎక్స్‌లో పోస్ట్‌

Advertisement
Update:2024-10-03 08:45 IST

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సినీ పరిశ్రమలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు. ' నా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. సమంత మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు' అని కొండా సురేఖ తెలిపారు.

బుధవారం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైంది. మంత్రి వ్యాఖ్యలపై సినీ ప్రముఖలంతా మండిపడ్డారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. విపక్ష నేతను విమర్శించడానికి ఏది పడితే అది మాట్లాడి అభాసుపాలయ్యారు. కొండా కుటుంబానికి ఇది కొత్త కాదని, వరంగల్‌ ప్రజలందరికీ తెలుసుని బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చివరికి తన వ్యాఖ్యలు ఉప సంహరించుకున్నట్లు తెలిపారు. 

నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు: కొండా

మరోవైపు ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చింది. మరొకరిని నొప్పించాలని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను. కేటీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఆయన సారీ చెప్పాల్సిందేనని మంత్రి డిమాండ్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News