40 లక్షల రేషన్‌ కార్డులిస్తామని చెప్పి 40 వేలే ఇస్తారా?

మూడు శాతం మందికి మాత్రమే లబ్ధి చేయడం ఏమిటీ : సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ

Advertisement
Update:2025-01-29 16:43 IST

రాష్ట్రంలో అర్హులైన 40 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 40 వేల కుటుంబాలకే ఇచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. నాలుగు పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పి మూడు శాతం మందికి కూడా వాటిని అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏటా రూ.20 వేల కోట్లు జమ చేస్తామని చెప్పారని, పది లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు నిర్మిస్తామని తెలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 12,991 గ్రామాలు ఉంటే కేవలం 561 గ్రామాల్లోనే నాలుగు పథకాలు వర్తింపజేయడం విస్మయం కలిగిస్తోందన్నారు. 70 లక్షల మంది రైతులకు గాను 4.41 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం గుర్తించిన నిరుపేద కూలీలు పది లక్షల మంది ఉంటే 20,336 మందికి మాత్రమే రూ.6 వేల చొప్పున ఇచ్చారని తెలిపారు.

40 లక్షల కుటుంబాలకు గాను 42,267 మందికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని వివరించారు. అంటే 99 శాతం మందికి రేషన్‌ కార్డులు, అంతే సంఖ్యలో మిగతా పథకాలు నిరుపేదలకు అందలేదన్నారు. 2024 -25 బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.7 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినా అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్‌ పార్టీ చెప్పేదానికి, చేతలకు పొంతనే లేదన్నారు. రేషన్‌ కార్డులపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. కేంద్రం నిధులతో నిర్మించే ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస యోజన పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీరుమార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News