తెలంగాణ కాంగ్రెస్‌తోనే పని చేస్తా.. సీనియర్లతో రాయబారం పంపిన వైఎస్ షర్మిల!

తాను పార్టీని స్థాపించి.. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశానని.. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. అందుకే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని వైఎస్ షర్మిల చెబుతున్నారు.

Advertisement
Update:2023-07-03 15:04 IST

వైఎస్ షర్మిలకు చెందిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ పార్టీని విలీనం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని తెలుస్తున్నది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో రెండుగా విడిపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత షర్మిల ఏ రాష్ట్రం నుంచి రాజకీయాలు చేయాలన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాను పార్టీని స్థాపించి.. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశానని.. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. అందుకే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని వైఎస్ షర్మిల చెబుతున్నారు. కాగా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని తెలంగాణ రాజకీయాల్లోకి రానిచ్చేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని చెబుతున్నారు.

కాగా, వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిక పట్ల తెలంగాణ కాంగ్రెస్‌లోని మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఇతర సీనియర్లు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తున్నది. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుందని సీనియర్లు అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు వచ్చిన రాహుల్ గాంధీతో ఇదే విషయాన్ని జానారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తున్నది.

రాహుల్ గాంధీ వద్దకు రాయబారానికి జానారెడ్డిని వైఎస్ షర్మిలే పంపినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చోటిస్తేనే పార్టీని విలీనం చేస్తానని షర్మిల పెట్టిన డిమాండ్‌ను రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తున్నది. మరోవైపు కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల విషయాన్ని రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. షర్మిల విషయంలో రాహుల్ గాంధీ కొన్ని సూచనలు చేశారని.. వాటి ప్రకారం ఆమె కాంగ్రెస్‌లో చేరతారని కేవీపీ స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లోకి సీనియర్ నాయకులు, గతంలో వైఎస్ఆర్‌కు దగ్గరగా ఉన్న వాళ్లు షర్మిలను స్వాగతిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి వర్గం మాత్రమే ఆమె ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీల్లేదని పట్టుబడుతుంది. దీనిపై అధిష్టానం మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌తో సంప్రదింపులు చేసి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నది. జూలై 8న వైఎస్ఆర్ జయంతిలోపు ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News