లోక్ సభ డీలిమిటేషన్‌లో తెలంగాణకు ఒక్క సీటు తగ్గదు : కిషన్ రెడ్డి
లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణలో ఒక్క సీటు తగ్గదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.;
దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. జమిలీ ఎలక్షన్లు అనేది దేశ భవిష్యత్ ఎజెండా అని కిషన్ రెడ్డి అన్నారు. ఇది బీజేపీ ఎజెండా కాదని, దేశ భవిష్యత్ ఎజెండా అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనపై అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందీ భాషను ఎవరి పైనా బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.తెలంగాణలో ఓట్లు, జనాభా తగ్గినప్పటికీ ఒక్క లోక్ సభ స్థానం కూడా తగ్గదని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని ఆయన తెలిపారు.పార్లమెంటు సమావేశాల అనంతరం ఈ పది జాతీయ రహదారులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ రహదారుల ప్రారంభోత్సవానికి గడ్కరీ రానున్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం విషయమై కూడా గడ్కరీతో చర్చించామని, భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తుందని అన్నారు. ఫ్లై ఓవర్ల కింద భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సర్, చంద్రశేఖర్ తివారీలు పాల్గొన్నారు.