మహిళలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.;

Advertisement
Update:2025-03-08 18:04 IST

దేశంలో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఓటీటీల రూపంలో అశ్లీలత ఏకంగా ఇళ్లలోకే వచ్చేసిందని ఆమె పేర్కొన్నారు. మహిళలపై నిత్యం జరుగుతోన్న అఘాయిత్యాలకు రీల్ సన్నివేశాలు కూడా ప్రధాన కారణమని ఆరోపించారు. ఓటీటీ లో అభ్యంతర కంటెంట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళామణులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. స్త్రీలను తక్కువ చేసి చూపించే.. ఓటీటీ కంటెంట్‌ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు వీధుల్లో అశ్లీల పోస్టర్లను మహిళలంతా కలిసి చించి తగులబెట్టే వారని గుర్తు చేశారు. గడిచిన పదేళ్ల కాలంలో అవే అశ్లీల పోస్టర్లను రాష్ట్రంలోని మహిళా సంఘాలు వెళ్లి తగులబెట్టిన ఘటనను తనకు కనిపించలేదని అన్నారు.

మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాన వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. జనగణనకు బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు జనగణన త్వరగా పూర్తిచేస్తే.. రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారన్నారు. ప్రతీ మహిళకు రూ.2500 ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదని విమర్శించారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహీర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వీర మహిళలు తెలంగాణ గడ్డపై పుట్టడం మనకు గర్వకారణం. మహిళలకు కులమతాలు లేవు.. మహిళలది ఒకే కులం. మహిళలలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని కవిత పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News