మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.;
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.రాష్ట్రంలో ఏ ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తే.. తనను తిట్టొచ్చని బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం విమర్శించారు. టన్నెల్ కూలితే.. పంటలు ఎండితే నన్ను తిట్టవచ్చని పైశాచిక ఆనందం పొందుతున్నారు. 10 నెలలు కాకపోయినా ఈ ఏడుపులు ఏంటి..? ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలి. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని సీఎం అన్నారు. స్కూల్ పిల్లలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలను కూడా వారికే అప్పగించామని గుర్తు చేశారు. ఇందుకోసం త్వరలోనే ప్రతి జిల్లాలో ఇందిరా శక్తి భవనాలు నిర్మిస్తామని అన్నారు. సోలార్ ఉత్పత్తిలో అదానీ, అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడేలా చేస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి గెలుపించుకుంటామని అన్నారు. ప్రతి మండలంలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోడౌన్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు. అంటే నేను మీ కుటుంబ సభ్యుడిని సీఎం తెలిపారు.