చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?

బీజేపీకి జనసేన మాత్రమే మద్దతు ఇస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్, వైఎస్ఆర్టీపీ, సీపీఐ మద్దతు ఉన్నది.

Advertisement
Update:2023-11-04 08:39 IST

తెలంగాణ ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఎవరు మద్దతు ఇచ్చినా ఓకే అంటూ ముందుకు వస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో దిగగా.. కాంగ్రెస్ మాత్రం చిన్నాచితకా పార్టీలన్నింటినీ వెనుకేసుకొని పోరాటానికి సిద్ధమైంది. అసలు క్షేత్ర స్థాయిలో ఓట్లు ఉన్నాయో లేవో తెలియని పార్టీ మద్దతు కూడా తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల గురించి ఎంత హైరానా పడుతుందో అర్థం అవుతోంది.

బీజేపీకి జనసేన మాత్రమే మద్దతు ఇస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్, వైఎస్ఆర్టీపీ, సీపీఐ మద్దతు ఉన్నది. పొత్తు పెట్టుకుంటామని చెప్పి.. చివరి క్షణంలో మోసం చేయడంతో సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే క్షేత్ర స్థాయిలో అసలు ఓట్లు ఉన్నాయో లేవో తెలియని వైఎస్ఆర్టీపీ మద్దతును కాంగ్రెస్ స్వీకరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీజేఎస్ మద్దతు గతంలో కూడా కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీని కూడా తన జేబులో వేసుకొని తిరుగుతోంది.

ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఆశ చూపి మద్దతు తీసుకున్నదనే ప్రచారం ఉన్నది. అయితే వారిద్దరికీ క్షేత్ర స్థాయిలో అంత బలం లేదని.. అనవసరంగా రాజ్యసభ సీటు వేస్ట్ అని కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులే చర్చించుకోవడం గమనార్హం. వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే తెలంగాణలో నష్టపోతామని ముందు నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. దీంతో విలీనంపై పార్టీ అధిష్టానం వెనక్కు తగ్గింది. కానీ మద్దతు ఇస్తామంటే మాత్రం తీసుకున్నది.

షర్మిల వల్ల పాలేరులో తప్ప ఎక్కడా లాభం ఉండే అవకాశం లేదని స్వయంగా పార్టీ నాయకులే చెబుతున్నారు. కనీసం వామపక్షాలతో పొత్తు ఖరారు చేసుకొని ఉంటే.. వారికి ఉన్న ఓటు బ్యాంకు అయినా కలిసి వచ్చేది. వామపక్షాలను పక్కన పెట్టి.. ఆ లోటు పూడ్చుకోవడానికి ఇలా కోదండరాం, షర్మిల మద్దతు తీసుకోవడం తప్పే అని అంటున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో పోటీలో లేని తెలుగుదేశం మద్దతు కూడా కాంగ్రెస్‌కు ఉన్నది. ఆ పార్టీ అధికారికంగా ఎవరికీ తమ మద్దతును ప్రకటించక పోయినా.. కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ టీడీపీ నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

ఇలా చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం ఎంత వరకు కలిసి వస్తుందో చెప్పలేము కానీ.. బీఆర్ఎస్‌కు మాత్రం మంచి అస్త్రాన్ని ఇచ్చినట్లు అయ్యింది. దొంగలంతా ఒక చోట చేరారంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీ, రాజశేఖర్ రెడ్డి కుమార్తె మద్దతు తీసుకోవడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక్క బీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఇంతటి బలగాన్ని వెంటేసుకొని రావడం కూడా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తప్పకుండా కాంగ్రెస్‌కు మైనస్సే కానీ లాభం చేకూర్చదని అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News