ఇండిపెండెంట్ గా జలగం..! బీఆర్ఎస్ బుజ్జగింపులు ఫలించేనా..?
వనమాకే అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది బీఆర్ఎస్. దీంతో జలగం పార్టీకి దూరంగా ఉంటూ ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకున్నారు.
2018లో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావుకి ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారని అంటున్నారు. నామినేషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు నామినేషన్ల చివరి రోజు ఆయన కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ తరపున బుజ్జగింపులు జరిగే అవకాశముంది. చివరి నిమిషంలో అయినా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని, పోటీలో లేకుండా ఆగిపోతారని అంటున్నారు.
ఎందుకీ పరిస్థితి..?
2018లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. వనమా చేరిక బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక నేత జలగం వెంకట్రావుకి ఇష్టం లేదు. కాలక్రమంలో ఆ టికెట్ వనమాకే ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. దీంతో జలగం అలిగారు. బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశారు. రేపు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తారని అంటున్నారు.
జలగం అలకకు మరో బలమైన కారణం కూడా ఉంది. తప్పుడు అఫిడవిట్ తో గెలిచారన్న కారణంతో ఇటీవల వనమాపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. రెండో స్థానంలో ఉన్న జలగంను ఎమ్మెల్యేగా ఖరారు చేసింది. అయితే తనను ఎమ్మెల్యేగా గుర్తించే విషయంలో పార్టీ కూడా ఆసక్తి చూపించలేదని జలగం అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా వనమాకే అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది బీఆర్ఎస్. దీంతో జలగం పార్టీకి దూరంగా ఉంటూ ఇప్పుడు ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకున్నారు.