రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేయాలి
అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంపై మంగళవారం సెక్రటేరియట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి ఒకటి నుంచి 31 వరకు ప్రతి గ్రామంలోనూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలు, 62 ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఉత్సవాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలన్నారు. హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ, ట్రైనింగ్ క్లాసులు, వర్క్‌షాప్‌లు, సెనినార్‌లు, ఐ చెకప్ క్యాంపులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలతో సంభవిస్తున్న మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు, కొత్తగా చేపట్టనున్న నియామకాలు, పెద్దపల్లి, ఏటూరునాగారం డిపోల పనులు, మధిర, కోదాడ, హుజూర్‌నగర్, మంథని, ములుగు బస్ స్టేషన్‌ల పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాజ్ రాజ్, డీజీపీ జితేందర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.