టీసీల్లో కుల ప్రస్తావన ఎందుకు? విద్యా శాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

కులాన్ని నిర్ధారించడానికి రెవెన్యూ శాఖ ఉండగా.. ఇలా పాఠశాలలు ఎందుకు రాస్తున్నాయో తెలియడం లేదని చెబుతూ బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఫైనాన్స్ మేనేజర్ సంబారపు నారాయణ హైకోర్టుకు లేఖ రాశారు.

Advertisement
Update:2023-05-17 10:31 IST

విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్లి పోయే సమయంలో ఇచ్చే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)లో కులాన్ని ఎందుకు రాస్తున్నారని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఒకరి కులాన్ని ఇలా అనుమతి లేకుండా సర్టిఫికెట్‌లో బహిరంగంగా రాయడం సబబేనా అని అడిగింది. ఈ మేరకు వెంటనే తగిన వివరణ ఇవ్వాలని విద్యా శాఖను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూలై 31లోగా సంబంధింత అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

పాఠశాల నుంచి తీసుకునే టీసీల్లో కులాన్ని ప్రస్తావిస్తున్నారని.. కులాన్ని నిర్ధారించడానికి రెవెన్యూ శాఖ ఉండగా.. ఇలా పాఠశాలలు ఎందుకు రాస్తున్నాయో తెలియడం లేదని చెబుతూ బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఫైనాన్స్ మేనేజర్ సంబారపు నారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. నారాయణ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు పిల్‌గా మార్చి విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టి తగిన వివరణ ఇవ్వాలని తెలంగాణ విద్యా శాఖను ఆదేశించింది.

విద్యా శాఖ పరిధిలో పని చేసే పాఠశాలలు ప్రజల కులానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తున్నాయని.. ముఖ్యంగా టీసీల్లో దీని ప్రస్తావన ఉంటుందని నారాయణ లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే అధికారికంగా కుల దృవీకరణ పత్రాలు జారీ చేస్తోంది. అయితే, టీసీలనే కొంత మంది కుల దృవీకరణగా చూపిస్తున్నారు. విద్యా శాఖ జారీ చేసే సర్టిఫికెట్ కుల దృవీకరణ కోసం ఎలా ఉపయోగిస్తారని నారాయణ ప్రశ్నించారు.

అంతే కాకుండా టీసీల్లో బహిరంగంగా కాస్ట్ వివరాలు ఉండటం అంటే అది వ్యక్తిగత గోప్యతకు భగం వాటిల్లినట్లే. తన క్యాస్ట్ ఏంటో సదరు వ్యక్తి ఇష్ట పూర్వకంగా తెలియజేస్తేనే ఇవ్వాల్సిన సర్టిఫికెట్. కానీ టీసీల్లో బహిరంగంగా రాయడం వల్ల ప్రైవసీకి భంగం కలుగుతోందని నారాయణ లేఖలో పేర్కొన్నారు. కాగా, దీనిపై జూలై 31 లోగా వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News