దళితులపై రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు ద్వేషం
రెండో విడత దళితబంధు నిధులివ్వమంటే బూటుకాళ్లతో తంతారా : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
దళితులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకింత ద్వేషమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని, హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం సహా మరో మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని గుర్తు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ఉన్నప్పుడే 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారని, ఇంకో 5 వేల కుటుంబాలకు సాయం చేయాల్సి ఉందన్నారు. దళితబంధు నిధులు ఇవ్వాలని ధర్నా చేస్తే తనపై పోలీసులు దాడి చేశారని, దళిత మహిళను బూటు కాళ్లతో తన్నారని తెలిపారు. ధర్నా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హుజూరాబాద్ ఏసీపీ హెచ్చరిస్తున్నారని.. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఎన్నికలకు ముందు దళితబంధు సాయం రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉన్న పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. తనను ఇబ్బంది పెడితే సహిస్తానని.. దళితులపై దాడులు చేస్తే ఊరుకోబోనని అన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే రైతులు కలెక్టర్ పై తిరగబడి ఉరికించారని, దళితబంధు ఇవ్వకుంటే హుజూరాబాద్ లోనూ అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. తన పోరాటం రేవంత్ ప్రభుత్వంపైనే కాని పోలీసులపై కాదన్న విషయం గుర్తించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అనగానే తాను పాదయాత్ర చేస్తానని రేవంత్ అంటున్నారని, ఆయనకు దమ్ముంటే మూసీ నిర్వాసితుల వద్ద పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ పోలీసులను పక్కన పెట్టి ప్రజల్లోకి వస్తే ఆ ప్రజలే ఆయనను ఉరికిస్తారని అన్నారు. రేవంత్ తన భాషను సరిదిద్దుకోవాలన్నారు.