ఆ మూడో సీటు గెలిచేదెవరు?.. తెలంగాణలో రసవత్తరంగా రాజ్యసభ పోరు
ఒక్కో రాజ్యసభ స్థానానికి 39.6 మంది ఎమ్మెల్యేలుండాలి. ఆ లెక్కన కాంగ్రెస్ ఒక రాజ్యసభ స్థానం ఈజీగా గెలుచుకోగా రెండో స్థానంలో పోటీ చేయడానికి 25 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు.
దేశవ్యాప్తంగా 55 మంది రాజ్యసభ సభ్యులకు వచ్చే ఏడాది ఏప్రిల్‌తో గడువు ముగియనుంది. ఇందులో తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే కావడం విశేషం. ఈ మూడు స్థానాలకు మార్చిలో జరగబోయే ఎన్నికలు తెలంగాణలో రసవత్తర రాజకీయాలకు వేదిక కాబోతున్నాయి.
మూడు సీట్లు గెలిచే సీన్ ఎవరికీ లేనట్లే
ఏ పార్టీకీ అసెంబ్లీలో బంపర్ మెజార్టీ లేనందున ఈ మూడు సీట్లూ గంపగుత్తగా ఒకే పార్టీ గెలుచుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సంఖ్యాబలంతో ఒకటి గెలుచుకోగలదు. అలాగే బీఆర్ఎస్‌కు ఒక సీటు ఖాయం. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో రాజ్యసభ స్థానం గెలుచుకునే అవకాశాలున్నాయి.
మూడో స్థానం గెలవాలంటే పొత్తులు తప్పవా?
కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకటి కలిపి 65 మంది ఎమ్మెల్యేల బలముంది. తెలంగాణలో ఒక్కో రాజ్యసభ స్థానానికి 39.6 మంది ఎమ్మెల్యేలుండాలి. ఆ లెక్కన కాంగ్రెస్ ఒక రాజ్యసభ స్థానం ఈజీగా గెలుచుకోగా రెండో స్థానంలో పోటీ చేయడానికి 25 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. బీఆర్ఎస్ 39, మిత్రపక్షం మజ్లిస్‌కున్న ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిపి 46 మంది ఎమ్మెల్యేలున్నట్లు. అంటే ఒక స్థానం గెలుచుకోగా బీఆర్ఎస్ దగ్గర మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే. ఈ లెక్కన మూడో స్థానం గెలుచుకోవడానికి కాంగ్రెస్‌కు అవకాశాలే ఎక్కువ. తమకున్న సంఖ్యాబలం ప్రకారం ముందుకెళితే కాంగ్రెస్‌కు 2, బీఆర్ఎస్‌కు ఒక రాజ్యసభ స్థానం ఏకగ్రీవంగా దక్కుతాయి. కాదని మూడింటి కోసం ముందుకెళితే పోటీ తప్పదు. అప్పుడు 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ఎటు నిలబడుతుందనేది ఎన్నికలను ఆసక్తికరంగా మార్చడం ఖాయం.
లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో హస్తం హవానే.. సీఓటర్ సర్వే వెల్లడి
తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకుని రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచింది. అలాంటిది పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినందున ఆ ఊపులో లోక్‌సభ సీట్లనూ పెద్ద సంఖ్యలో గెలవాలని భావిస్తోంది.