నల్గొండలో కాంగ్రెస్ గోస తీర్చేదెవరు?

ఒకరికి ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

Advertisement
Update:2023-11-04 18:27 IST

తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు లభించిన జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులందరూ ఇదే జిల్లాకు చెందిన వాళ్లు కావడం గమనార్హం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ఉద్ధండులు నల్గొండ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి వల్లే నల్గొండ జిల్లాలో సీట్ల పంచాయితీ జరుగుతుండటం కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రెండు జాబితాలను ప్రకటించింది. అయినా సరే నల్గొండ జిల్లాలో కీలకమైన మూడు నియోజకవర్గాలకు సంబంధించిన టికెట్లపై ఇంకా సందిగ్దం వీడలేదు. సూర్యాపేట నుంచి సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో తుంగతుర్తి నుంచి వరుసగా గెలిచిన దామోదర్ రెడ్డి.. ఆ తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. మరోసారి సూర్యాపేట నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు.

ఏఐసీసీ స్థాయిలో సంబంధాలు ఉన్న దామోదర్ రెడ్డి ఈ సారి టికెట్ కోసం తీవ్రంగానే కష్టపడాల్సి వస్తోంది. ఆయనకు పోటీగా పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై సునిల్ కనుగోలు టీమ్ సర్వే చేసినా పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తున్నది. సూర్యాపేటలో బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డిని ఓడించడానికి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేక పోతోంది. దామోదర్ రెడ్డికి ఇవ్వాలని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతుండగా.. రమేశ్ రెడ్డి వైపు రేవంత్, పొంగులేటి ఉన్నట్లు సమాచారం.

మిర్యాలగూడ సీటును మొదట్లో సీపీఎంకు కేటాయించాలని భావించారు. కానీ అక్కడ బలమైన కాంగ్రెస్ నాయకులు ఉండటంతో సొంత అభ్యర్థులనే దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో సీపీఎం ఏకంగా పొత్తునే వదిలేసింది. అయినా సరే కాంగ్రెస్ ఇంకా డైలమాలోనే ఉన్నది. మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఇటీవల బత్తుల వర్గం మిర్యాలగూడలో భారీ ర్యాలీ కూడా చేపట్టింది. ఇద్దరూ సమర్థులైన అభ్యర్థులే. అయితే ఒకరికి ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేకపోవడంతో టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఎస్సీ రిజర్వుడు సీట్ అయిన తుంగతుర్తి విషయంలో కాంగ్రెస్ సుదీర్ఘ సమాలోచనలు చేస్తోంది. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దయాకర్ మొదటి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి వర్గంగా ముద్ర పడ్డారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని ఎవరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మందుల సామేలు, నగరగారి ప్రీతమ్, పిడమర్తి రవి ఈ టికెట్ కోసం గట్టిగా పోటీ చేస్తున్నారు. దీంతో తుంగతుర్తి వ్యవహారం కేసీ వేణుగోపాల్ వరకు వెళ్లినట్లు సమాచారం.

ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైనా.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితి ఇంకా తీరలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సెగ్మెంట్లే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ టికెట్ల ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News