కాలం చెల్లిన మందులతో ప్రాణాల మీదికి వస్తే బాధ్యులెవరు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే అందులో ఎక్స్‌పెయిరీ తేదీ అయిపోయిన మందులను ఇచ్చారని.. ఇంతకన్నా నిర్లక్ష్యం ఉంటుందా అని 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. గిరిజన గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా.. ఆ మందుల వల్ల ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యులని నిలదీశారు. మెడికల్ క్యాంప్ లోకి కాలం చెల్లిన మందులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ జిల్లాలో ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఏం చేస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు గిరిజన బిడ్డలను పట్టించుకునే తీరిక లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర ఇంకెప్పుడు వీడుతుందని నిలదీశారు.